గోదావరి మహోగ్రరూపం, పోటెత్తుతున్న కృష్ణమ్మ- ముంపు.. తాజా హెచ్చరికలు..!!

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది.

Advertisement

తెలుగు రాష్ట్రాలు సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 15,53,130 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కడెం ప్రాజెక్టుతోపాటు, లోకల్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల నుంచి ఎల్లంపల్లికి 44వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాణహిత నుంచి వచ్చే వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. సమ్మక్కసాగర్‌ వద్ద 12.60 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం 10.60 అడుగులకు చేరి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువైంది.

Advertisement
పోటెత్తుతున్న కృష్ణమ్మ- శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం, గేట్లు ఎత్తివేత..!!

అధికారుల ముందస్తు చర్యలు

దీంతో, బ్యారేజ్‌లోని 175 గేట్లు ఎత్తి 8.65 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పలు కాజ్‌వేలు, రహదారులు నీటమునగగా లంక గ్రామాలు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం నాటు పడవలను అందుబాటులో ఉంచారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తుతున్నది. శుక్రవారం 1.22 లక్షల క్యూసెక్కులు రాగా.. 24 గేట్లు ఎత్తి దిగువకు 1,36,689 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 834.40 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 54.34 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

English Summary

Godavari River is witnessing a massive flood following heavy upstream rainfall, with inflows exceeding 13 lakh cusecs at Dowleswaram