Video: జాతి వైరం మరిచింది.. అనాథ కుక్కపిల్లలకు అమ్మగా మారింది!

"భాష తెలియని మూగ జీవులవి.. కానీ, ప్రేమే శ్వాసగా బతికే ప్రాణాలవి! కన్నతల్లి కనుమూస్తే.. కడుపుకోతను చూసి తట్టుకోలేకపోయాయి, జాతి భేదాల సరిహద్దులు చెరిపేసి.. మాతృత్వపు ఒడిని పరిచాయి!" సృష్టిలో మాతృత్వానికి మించిన మధురమైన అనుభూతి మరొకటి లేదు. ఆ మాతృత్వం కేవలం మనుషులకే పరిమితం కాదని, మూగజీవాల్లోనూ అంతకుమించిన మమకారం, ప్రేమానురాగాలు ఉంటాయని నిరూపించే ఒక హృదయాన్ని కదిలించే అద్భుత ఘట్టం కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామంలో ఆవిష్కృతమైంది. కన్నతల్లిని కోల్పోయి అనాథలుగా మారిన కొన్ని కుక్కపిల్లలను, ఓ వరాహం (పంది) చేరదీసి వాటి ఆకలి తీరుస్తూ కంటికి నైరుతిగా కాపాడుకుంటోంది.

Advertisement

కొద్దిరోజుల క్రితం జంపాపురం గ్రామంలో ఓ కుక్క కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. అయితే విధి ఆ చిన్న ప్రాణాలపై కరుణించలేదు. అనారోగ్య కారణాలతో ఆ తల్లి కుక్క ఇటీవల మృతి చెందింది. కళ్లు కూడా సరిగ్గా తెరవని ఆ పసి కుక్కపిల్లలు, తల్లి పాలు లేక ఆకలితో అల్లాడుతూ దిక్కులేని స్థితిలో మిగిలిపోయాయి. ఆ పసి ప్రాణాల ఆకలి కేకలు, తల్లి కోసం అవి పడే రోదన ఆ ఊరిలో తిరిగే ఓ వరాహాన్ని కదిలించింది.

Advertisement

శత్రుత్వం వీడి.. తల్లిగా మారి!

సాధారణంగా ఏ జంతువైనా తన పిల్లలను తప్ప ఇతర జంతువులను దరిచేరనివ్వదు. పైగా కుక్కలకు, పందులకు అస్సలు పడదు. కానీ ఇక్కడ ఆ సహజ స్వభావాలన్నీ ప్రకృతి నియమాల ముందు మోకరిల్లాయి. ఆ వరాహం తనలోని శత్రుత్వాన్ని, జాతి భేదాలను పక్కనబెట్టింది. అనాథలైన ఆ కుక్కపిల్లలను ప్రేమతో అక్కున చేర్చుకుంది. తన సొంత బిడ్డల్లాగే భావించి వాటికి పాలు ఇస్తూ రక్షణగా నిలిచింది.

మురిసిపోతున్న జంపాపురం..

ప్రస్తుతం ఆ కుక్కపిల్లలు ఆ వరాహం వెంటే నడుస్తూ, దాని పాలు తాగుతూ, దానిపైనే ఎక్కుతూ ఆడుకుంటున్నాయి. వరాహం కూడా ఎంతో ఓపిగ్గా ఆ పిల్లలను ఆడిస్తూ, ఒక కన్నతల్లిలా వాటి బాగోగులు చూసుకుంటోంది. మనుషుల్లోనే బంధాలు, అనుబంధాలు కరువైపోతున్న ఈ రోజుల్లో.. మూగజీవాల మధ్య వెల్లివిరిసిన ఈ అపురూపమైన ప్రేమను, మాతృత్వాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యంతో పాటు ఎమోషనల్ అవుతున్నారు. జాతి భేదాలను తుడిచేసి, మాతృత్వానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ అందరి మనసులను గెలుచుకుంటోంది.

Advertisement

English Summary

In a heartwarming incident in Jampapuram village of Kurnool, a pig has adopted a litter of orphaned puppies, nursing and protecting them after their mother's death