శ్రీవారి సేవకుల విషయంలో టీటీడీ నిర్ణయాలు- సూచనలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకుల పాత్ర అత్యంత కీలకమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని సేవాసదన్ 2 లో రెండో విడత శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్ల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Advertisement

మొదటి విడతలో దాదాపు 1,400 మంది సూపర్‌వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చింది టీటీడీ. ఇది రెండో బ్యాచ్. ఈ విడతలో భాగంగా సుమారు 2,600 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి తాజాగా ట్రైనింగ్ సెషన్ ను ప్రారంభించింది. దీనికోసం ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో ప్రత్యేక శిక్షణ మాడ్యూల్‌ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెంకయ్య చౌదరి ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

ఈ మాడ్యూల్ గ్రూప్ సూపర్‌వైజర్ల సమర్థతను పెంచేందుకు ఎంతగానో తోడ్పడుతుందని, శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త విధానాలను సమగ్రంగా అర్థం చేసుకుని, సమర్థవంతంగా శ్రీవారి సేవకులకు తగిన మార్గదర్శకత్వం చేస్తూ సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా కర్తవ్య నిర్వహణకు సంబంధించిన విషయాలనే కాకుండా, సేవా నిరతి పెంపొందేలా ఆధ్యాత్మిక విలువలను కూడా ఇక్కడ బోధిస్తున్నట్లు వివరించారు.

నిత్య జీవితంలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో పాటు ఆధ్యాత్మిక చింతన తోడైతే ఏ సేవా రంగంలోనైనా అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చని ఆయన ఉద్ఘాటించారు. సూపర్‌వైజర్లు ఇదే వైఖరితో స్వామివారి సేవకులుగా వచ్చే వేలాది మంది భక్తులకు సరికొత్త సేవానియమాలను నేర్పాలని కోరారు. తిరుమలకు దేశ విదేశాల నుంచి వచ్చే సామాన్య భక్తులతో అత్యంత ఓర్పు, సహనం, త్రికరణశుద్ధిగా వ్యవహరించాలని శ్రీవారి సేవకులకు పిలుపునిచ్చారు.

Advertisement

టీటీడీ కల్పిస్తోన్న దర్శన విధానాలు, వసతి సదుపాయాలపై పట్టు సాధించడం ద్వారా భక్తులకు కచ్చితమైన సమాచారాన్ని సమయానికి అందించవచ్చని తెలిపారు. దీనివల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణాన్ని ప్రశాంతంగా ముగించుకోగలుగుతారని, తద్వారా తిరుమల విశిష్టత, నిస్వార్థ భక్తి భావం మరింత ఇనుమడిస్తుందని అదనపు ఈఓ పేర్కొన్నారు.

English Summary

Inaugural Session of Srivari Seva Group Supervisors Training Emphasizes Leadership Importance at Seva Sadan 2. Ch Venkaiah Chowdary, AEO informed that around 1,400 supervisors were trained in the first batch, while 2,600 supervisors are being trained in the second phase.