నిర్మలమ్మ వరాలు జల్లు.. రూ. 2 వేల కోట్లతో రాష్ట్రానికి రాక

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సరికొత్త రికార్డుకు వేదిక సిద్ధమవుతోంది. వెనుకబడిన ప్రాంతంలో పేదరికాన్ని పారద్రోలి, పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి సరికొత్త ఊతం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను రచించింది. దీనిలో భాగంగా ఈ నెల 17వ తేదీన నరసరావుపేట వేదికగా అపూర్వ రీతిలో బృహత్తర రుణమేళాను నిర్వహించనున్నారు. వివిధ రంగాల లబ్ధిదారులకు దాదాపు రూ.2,000 కోట్ల భారీ మొత్తంలో రుణాలను పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమం నేరుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగానే జరగనున్నట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటించారు

Advertisement

పల్నాడు జిల్లా ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేస్తూ, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ రుణమేళా ఒక సువర్ణావకాశంగా మారనుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పల్నాడు వెనుకబాటుతనాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను స్వయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 17న నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇండోర్ స్టేడియంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు హాజరుకానున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 3,000 మంది లబ్ధిదారులు నేరుగా ఈ సదస్సుకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

కాగితాల వేధింపులు లేవు.. నేరుగా ఇళ్ల వద్దకే బ్యాంకర్లు

గతంలో సామాన్యులు, చిరు వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా లోన్లు రాక, విసిగిపోయి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి సర్వస్వం కోల్పోయేవారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి చరమగీతం పాడుతూ, 'ప్రజల వద్దకే బ్యాంకులు - ఇంటి వద్దకే రుణాలు' అనే నూతన విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. కేవలం పాత అకౌంట్లను సర్దుబాటు చేయడం కాకుండా, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 20 రకాల వినూత్న పథకాల ద్వారా అర్హులైన కొత్త లబ్ధిదారులందరికీ ఈ మేళాలో రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే 'క్రెడిట్ అవుట్ రీచ్' కార్యక్రమాన్ని పల్నాడులో నిర్వహించాలని తాను గత రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి.

Advertisement

మహిళా క్లస్టర్లు.. ఆదివాసీలకు అండ

ఈ రుణ విప్లవంలో భాగంగా పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ప్రత్యేకంగా మహిళా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ ప్రకటించారు. అంతేకాకుండా, పర్యావరణ హిత ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు గానూ జిల్లాలోని 7 గ్రామాలను ఒక యూనిట్‌గా ఎంపిక చేసి, 'సూర్య ఘర్' పథకం కింద ప్రతి ఇంటికీ సోలార్ రుణాలు అందిస్తామన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. తొలిసారిగా ఆదివాసీల వ్యవసాయ భూములను కుదువ పెట్టుకుని కూడా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గర్వంగా ప్రకటించారు.

English Summary

Union Finance Minister Nirmala Sitharaman and CM Chandrababu Naidu will visit Narasaraopet in Palnadu district on July 17 to distribute Rs 2,000 crore loans. MP Lavu Sri Krishna Devarayalu announced that 20 central schemes will benefit local citizens.