జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్...పితాని బాలకృష్ణముమ్మడివరం నియోజకవర్గం


జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్...!

హైదరాబాద్:వచ్చే సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా జనసేన సమర శంఖం పూరించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసే తొలి అవకాశాన్ని పొందిన ఆ నేత పితాని బాలకృష్ణ.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనసేన తరుపున శాసనసభ సభ్యుడిగా పోటీచేసే అవకాశాన్ని పొందిన తొలి నేతగా పితాని బాలకృష్ణను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

పవన్ కళ్యాణ్

ప్రశ్నించడమే ప్రధాన కర్తవ్యమనే నినాదంతో జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల అంచనాలను తలక్రిందులు చేస్తూ రాజకీయ సంగ్రామంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అజ్ఞాత‌వాసి తర్వాత ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించనని, రాజకీయ రంగంపైనే దృష్టిపెడుతానని స్పష్టం చేసిన పవన్ , అన్నమాట జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాపోరాటయాత్రతో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు, సాధకబాధకాలు తెలుసుకొంటున్న సంగతి తెలిసిందే.

తొలి ఎమ్మెల్యే అభ్యర్థి

రాజకీయ పార్టీని నడపడం అంత సులువుకాదన్న విమర్శలను అనూహ్యమైన ఎత్తుగడలతో చెల్లాచెదురు చేస్తూ పొలిటికల్ వార్ లో అంతకంతకు బలపడుతూ ఆయన ప్రత్యర్థుల గుండెల్లో రెళ్లు పరిగెత్తిస్తున్నారు. అదే క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో పోటీచేయబోయే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి రాబోయే ఎన్నికల సంగ్రామానికి సమర శంఖం పూరించారు. వైసిపి నుంచి జనసేన లో చేరిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ పితాని బాలకృష్ణకు అదే నియోజకవర్గం‌ ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

పితాని బాలకృష్ణ

ఆగష్టు 22 న వైసిపికి రాజీనామా చేసి అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ 8సంవత్సరాలు తనకు ప్రభుత్వ సర్వీసు ఉన్నా వైసీపీ అధినేత జగన్‌ టిక్కెట్‌ ఇస్తారనడంతో ఆ పార్టీలోకి చేరానని చెప్పారు. అయితే అర్ధాంతరంగా తనను కోఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పించి తనను, తన కులాన్ని అవమానించారన్నారు. తనకు కోఆర్డినేటర్‌ పదవి లేకపోయినా నేటివరకు నియోజకవర్గంలో ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నానన్నారు.

శెట్టిబలిజల్లో మంచి పేరున్న నాయకుడు

పవన్‌కళ్యాణ్‌ సిద్ధాంతాలు, సేవాకార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై తన అభిమానులతో చర్చించి వైసీపీకి రాజీనామా చేశానన్నారు. పవన్‌కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా అనుచరగణంతో జనసేన పార్టీలో చేరారు. ఎవరూ ఊహించని విధంగా జనసేనలో చేరిన పితాని బాలకృష్ణ బీసీ సామాజిక వర్గం నేత...శెట్టిబలిజల్లో మంచి పేరున్న నాయకుడు. ముమ్మిడివరం లో టిడిపి, వైసిపి నేతల కంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న పితాని బాలకృష్ణ జనసేనకి బాగా కలసివస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించగా, ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ ఆయనకే తొలి టికెట్ ప్రకటించడం ఆ అభిప్రాయాన్ని మరింత బలపర్చింది. ఏది ఏమైనా ఎపిలో జనసేన ఖాయంగా గెలిచే నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఒకటని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

Have a great day!
Read more...

English Summary

Hyderabad:JanaSena Party's First contestant announced by party Chief PawanKalyan, He is non other than Pithani Balakrishna from Mummidivaram constituency.