అతని ఆశలపై నీళ్లుచల్లిన జగన్, వారికి షాకిచ్చిన పవన్: ఆ టిక్కెట్ వ్యూహాత్మకంగానే


రాజమహేంద్రవరం: వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటన చేశారు. దీంతో తూర్పు గోదావరిలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే తాము ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని జనసేనాని ప్రకటించారు.

జగన్‌కు తూర్పులో భారీ షాక్, టీడీపీలోకి కీలక నేత!: బాబును కలిసిన ఎంపీ అభ్యర్థి

జగన్ ఇంచార్జిగా తప్పిస్తే జనసేనలో టిక్కెట్ సంపాదించారు

వచ్చే ఎన్నికల కోసం ఏ పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఏపీలోనే జనసేన నుంచి టికెట్‌ పొందిన తొలి అభ్యర్థిగా బాలకృష్ణ నిలిచారు. తద్వారా టీడీపీ, వైసీపీలకు ధీటుగా, దూకుడుగా సాగుతున్నట్లు చెప్పకనే చెప్పారు. బాలకృష్ణ మూడేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, నియోజకవర్గ ఇంచార్జిగా పని చేశారు. వైసీపీ టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో నియోజకవర్గంలో బాగా పర్యటించారు. సామాజిక కోణం సహా పలు కారణాలతో బాలకృష్ణను ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌కు వైసీపీ బాధ్యతలు అప్పగించింది.

కండువా కప్పుకోగానే టిక్కెట్

దీంతో బాలకృష్ణ తన అనుచరులతో వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. గత నెల విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ను కలిసి నియోజకవర్గం గురించి చర్చించారు. పవన్‌ కూడా బాలకృష్ణకు టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చారని అప్పుడే ప్రచారం సాగింది. తాజాగా, మంగళవారం హైదరాబాదులో జనసేన కండువా కప్పుకున్నారు. ఇలా కండువా కప్పుకోగానే అలా టిక్కెట్ ఇచ్చారు పవన్.

బాలకృష్ణ ప్రకటనతో వేడి రాజుకుంది

బాలకృష్ణకు టిక్కెట్ ఇవ్వడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ముమ్మిడివరంలో ఎస్సీ, శెట్టిబలిజ, మత్స్యకార, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఓటు బ్యాంకు ఎక్కువ. ఈ కారణంగా వైసీపీ పొన్నాడ సతీష్ కుమార్‌ను తీసుకు వచ్చి, ఆయనను ఇంచార్జిగా చేశారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఉన్నారు. సామాజికవర్గ సమీకరణలను బేరీజు వేసుకుని ముందుగానే జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో వేడి రాజుకుంది.

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే

పవన్ వ్యూహాత్మకంగానే ఈ సీటు ప్రకటించారని చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో కాపుల తర్వాత అధికంగా శెట్టి బలిజలు ఉంటారు. వారిని ఆకర్షించేందుకు బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చారని అంటున్నారు. కేవలం కాపు ఓట్లతోనే గెలవరు. దీనిని గుర్తించిన పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని వర్గాలను దరి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పారు.

Have a great day!
Read more...

English Summary

Jana Sena chief Pawan Kalyan has announced the party's first candidate to be contested in the next Assembly elections.