కాపు రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ప్రశ్నలకు జవాబిచ్చాం...అధికారిని ఢిల్లీ పంపాం:మంత్రి అచ్చెన్నాయుడు


అమరావతి:కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శాసనసభ ఆమోదించిన బిల్లుపై కేంద్రం కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు.

కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని..."సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీల్లేదు. కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల వల్ల అది దాటి పోతోంది. అలా ఎలా ప్రతిపాదిస్తారు"...అని ప్రశ్నించిందని మంత్రి అచ్చెన్నాయుడు సభకు వివరించారు. అందుకు తాము స్పందించి కాపుల కోసం బీసీల్లో ఎఫ్‌ కేటగిరీ పెట్టాలని బిల్లులో మేం ప్రతిపాదించామని బదులివ్వడం జరిగిందన్నారు.

అయితే దీనిపై మళ్లీ మరోసారి స్పందించిన కేంద్రం ఎఫ్‌ కేటగిరీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించిందన్నారు. అందుకు సమాధానంతో సహా కేంద్రం ప్రశ్నలన్నింటికీ సవివరంగా సమాధానాలు పంపామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. అంతేకాకుండా ఒక అధికారిని ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించి ఈ సమాధానాలను అక్కడి అధికారులకు వివరించేలా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇదిలావుండగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరుతున్నట్లుగా కాపు రిజర్వేషన్లపై గవర్నర్‌ ద్వారా నోటిఫికేషన్‌ ఇప్పించి అమలు చేయడం సాధ్యమా అని టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చాంబర్లో సోమవారం ఈ చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అటువంటి నోటిఫికేషన్‌ చెల్లదని కొందరు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఈ విషయమై ఒక అధికారి స్పష్టత నిస్తూ..."రాష్ట్రంలో ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతానికి చేరుకున్నాయి...అంతకుమించి రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తే కోర్టులు కొట్టివేస్తాయి...గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టులు కొట్టివేశాయి...రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం ఆమోదించి రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 9లో చేర్చినప్పుడు మాత్రమే అవి నిలబడేందుకు అవకాశం ఉంటుంది. షెడ్యూల్‌ 9లో చేర్చిన అంశాలు కోర్టు పరిధిలోకి రావు"...అని వివరించినట్లు తెలిసింది.

Have a great day!
Read more...

English Summary

Amaravathi: The Central Government has asked a few questions to State Government on the Kapu Reservation Bill, says BC Welfare Minister Achhenaidu at the assembly session on monday.