టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై ఆ వెసలుబాటు: చర్యలకు ఆదేశం

తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి విరమణ పొందిన వారికి ప్రభుత్వం తరఫున గుడ్ న్యూస్ వినిపించారు కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. చాలాకాలం నుంచీ టీటీడీ ఉద్యోగులు కోరుకుంటోన్న వెసలుబాటు ఇది. ఎట్టకేలకు దీనిపై ఓ ముందుడుగు పడింది. ఈ దిశగా ఈఓ చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.. టీటీడీలో. టీటీడీలో వివిధ విభాగాల్లో రిటైర్డ్ అయిన 122 మంది ఉద్యోగులకు సామూహికంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

ఇందులో ముద్దాడ రవిచంద్ర మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే.. అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు పదవి విరమణ అయ్యాక సన్మానం చేసే కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలా లేక శాఖల వారీగా చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

వివిధ శాఖలు, విభాగాల్లో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ అయ్యాక వారికి అందే బెనిఫిట్స్ అన్నింటినీ కూడా అదే రోజు వారి ఖాతాల్లో జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజూ సగటున 75,000 పైచిలుకు భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులను ఈవో అభినందించారు. పదవి విరమణ చేస్తోన్న టీటీడీ ఉద్యోగులను సమష్టిగా పండుగ వాతావరణంలో సన్మానించుకోవడం మంచి పరిణామమని జేఈఓ శరత్ అన్నారు. పదవి విరమణ పొందిన వారిని సన్మానించడం మహా సేవగా అభివర్ణించారు.

అనంతరం పదవి విరమణ పొందిన 122 మందికి ఒక్కొక్కరికి శ్రీవారి లడ్డూ, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవికె, అక్షింతలు, తీర్థం, శాలువా ఇచ్చి సత్కరించారు. అనంతరం ఈవోను టీటీడీ ఉద్యోగులు సత్కరించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ ఇళ్లకు చేర్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు.

English Summary

TTD Commitment to Retired Employess as the Benefits to Be Delivered on Retirement Day, Says EO. The EO appreciated the employees for serving thousands of devotees every day and said TTD would further improve the retirement process.