తిరుమలలో ఇలాంటి దర్శనం ఒకటుందని మీకు తెలుసా?

ఎన్నో గంటలు లైన్లో నిలబడి తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్తే రెప్పపాటులో దర్శనం అయిపోతుంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుందే తప్ప మనసు తృప్తిపడదు. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, కేవలం 40 నిమిషాల్లోనే స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునే ఒక మంచి ఆప్షన్ ఉందంటే నమ్ముతారా? దాన్నే 'శిశు దర్శనం' అంటారు. పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సదుపాయం అందిస్తోంది. చాలామంది భక్తులకు ఈ విషయం తెలియక, పసిపిల్లలను పట్టుకుని సాధారణ క్యూ లైన్లలో గంటల తరబడి చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఎలాంటి రుసుము లేకుండా, ముందుగా ఆన్‌లైన్ బుకింగ్ లేదా టోకెన్లు ఏమీ లేకుండానే శ్రీవారిని తొందరగా దర్శించుకోవడానికి టీటీడీ ఈ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసింది.

Advertisement
TTD: మూడు దశాబ్దాల విధానానికి స్వస్తి, కొత్త సంస్కరణలు - ఇక నుంచి..!!
Advertisement

ఏడాది లోపు వయసుండాలి

ఈ దర్శనానికి వెళ్లాలంటే పాపా లేదా బాబు వయస్సు కచ్చితంగా ఒక సంవత్సరం లోపు ఉండాలి. పసిపాపతో పాటు తల్లి, తండ్రికి మాత్రమే లోపలికి పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ ఈ పాపకు 12 ఏళ్ల లోపు ఉన్న అక్కలు లేదా అన్నయ్యలు ఉంటే, వారిని కూడా తల్లిదండ్రులతోపాటు లోపలికి అనుమతిస్తారు. కానీ తాతయ్యలు, అమ్మమ్మలు, మేనమామలు లాంటి మిగతా బంధువులకు మాత్రం ఈ లైన్లో అనుమతి ఉండదు. ఈ దర్శనం కోసం భక్తులను "సుపథం" మార్గం ద్వారా లోపలికి పంపిస్తారు. ఈ అవకాశం ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా సుపథం దగ్గరకు వెళ్లి బాబు లేదా పాప ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, అలాగే పేరెంట్స్ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపిస్తే సరిపోతుంది. పెద్ద పిల్లలు ఉంటే వారి ఆధార్ కార్డ్ కూడా చూపించాలి.

Advertisement
శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ 'బంగారం' లాంటి నిర్ణయం..!!

40 నిముషాల్లో దర్శనం

ఈ దర్శనానికి TTD చెప్పిన పద్ధతి ప్రకారం సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరి. లోపలికి వెళ్లేటప్పుడు చిన్నపిల్లలకు కావలసిన పాలు, వాటర్ బాటిల్స్, డైపర్లు లాంటివి వెంట తీసుకెళ్లడానికి సెక్యూరిటీ వాళ్లు అనుమతిస్తారు. సాధారణంగా 30 నుంచి 40 నిమిషాల్లో ప్రశాంతంగా దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేయవచ్చు. ఈ దర్శనం పూర్తిగా ఉచితం. పాపకు సంవత్సరం వయసు వచ్చేలోపు గరిష్టంగా 3 సార్లు ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. కాకపోతే ఒక దర్శనానికి, ఇంకో దర్శనానికి మధ్య కనీసం 90 రోజుల గ్యాప్ ఉండాలి. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి లాంటి పెద్ద పండుగల టైమ్‌లో ఈ దర్శనాన్ని రద్దు చేస్తారు. ఒకవేళ సాధారణ రోజుల్లో కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంటే లైన్ త్వరగానే మూసేస్తారు. అందుకే మధ్యాహ్నం 12 గంటలకంటే కాస్త ముందే సుపథం దగ్గరకు చేరుకోవడం మంచిది. ఏమైనా సందేహాలుంటే తిరుమల వెళ్లే ముందే TTD హెల్ప్‌లైన్ 0877-2233333 కి కాల్ చేసి కనుక్కోవచ్చు.

English Summary

TTD: At Tirumala, there is a special Shishu Darshan (infant darshan) facility to enable a quick visit to the deity. Parents with infants under one year of age can proceed via the Supatham entrance and complete the darshan within 40 minutes. This service is entirely free of charge.