శ్రీనివాసమంగాపురం ఆలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి తప్పనిసరి: టీటీడీ

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 80,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,838 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.86 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.

Advertisement

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.04 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 2.42 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,125 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

Advertisement

కాగా.. ప్రసిద్ధి చెందిన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ గురువారం ఆలయాన్ని సందర్శించారు. భారత పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాచీన ఆలయంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి ఏఎస్ఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పురావస్తు శాఖ సూచనల మేరకు ప్రతిపాదనలు సమర్పించి అనుమతులు పొందనున్నట్లు వెల్లడించారు. తాగునీటి సౌకర్యాల మెరుగుదల, క్యూ లైన్ల అభివృద్ధి, మెట్ల మరమ్మతులు, యాగశాల నిర్మాణం, పోటు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను గుర్తించినట్లు శరత్ తెలిపారు. క్యూ లైన్లను భక్తులకు మరింత అనువుగా తీర్చిదిద్దేందుకు ఏఎస్ఐ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

Advertisement

అదేవిధంగా కళ్యాణమండపం, ఆలయ ప్రాంగణంలోని ఇతర సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి పురావస్తు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను టీటీడీ జేఈఓ ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు లభించిన వెంటనే వాటిని వేగంగా పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని జేఈవో పేర్కొన్నారు.

English Summary

TTD Moves Forward with Plans to Improve Amenities Srinivasamangapuram Temple Upgrade with ASI Officials. TTD JEO Dr A Sharath visited the temple on Thursday and inspected the premises along with officials of the Archaeological Survey of India (ASI).