సాయిరెడ్డి రీ ఎంట్రీ, మారుతున్న లెక్కలు - టార్గెట్ ఫిక్స్..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ- కూటమి మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. ఇదే సమయంలో రాజకీయంగా కొత్త వేదికలు ప్రజల్లోకి వస్తున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Advertisement

విజయసాయి రెడ్డి మళ్లీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. వైసీపీ వీడిన తరువాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు. అయితే, పూర్తిగా రాజకీయాలకు దూరం కాలేదు. గత కొంత కాలంగా టీడీపీ, వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. పవన్ పైన మాత్రం ఎలాంటి విమర్శలు చేయటం లేదు. అప్పుడప్పుడు హిందుత్వ స్వరం వినిపించే విధంగా పోస్టులు కనిపిస్తున్నాయి. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళదామనుకున్నారనే టాక్‌ వినిపించింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే ఛాన్స్ దక్కలేదు. దీంతో, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా సాయిరెడ్డి కసరత్తు ముమ్మరం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహాలను విజయసాయిరెడ్డి ప్రారంభించినట్లు సమాచారం. . జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

Advertisement
విరుచుకుపడుతున్న అరుదైన వైరస్ - 22 మంది చిన్నారుల మృతి, హై అలర్ట్..!!

సంప్రదింపులు.. కార్యాచరణ

కాగా, ఇందు కోసం సాయిరెడ్డి మాజీ బ్యూరోక్రాట్ల తో మంత్రాంగం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా తటస్థుల నుంచి కొత్త రాజకీయ వేదికకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సభలు, ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే స్పందనకు అనుగుణంగా పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలో ప్రధానంగా యువత, రైతులు, మహిళలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ కూటమికి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవాలనే లక్ష్యంతో విజయసాయిరెడ్డి కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. సాయిరెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆ నిర్ణయం కారణంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English Summary

Vijaya Sai Reddy moving with new strategies to announce new party in AP for next Elections