పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఏపీ తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా ఇది బలపడుతోంది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రత్యేకించి.. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ ప్రాంతాల్లో బుధవారం వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉండి, చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పిడుగుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీటి తీవ్రత ఎక్కువగా ఉండే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం, ఎస్ కోట, భీమునిపట్నంలో పిడుగులు పడే తీవ్రత అధికంగా ఉండొచ్చు. రాయలసీమలోని అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడకక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. చెట్ల కింద గానీ, ఒంటరిగా ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు.అలాంటి వారిపై ఉక్కుపాదం మోపండి- పోలీసులకు రేవంత్ పూర్తి స్వేచ్ఛ