మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక గా మారిందని చెప్పుకొచ్చారు. గత 27 నెలల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర, భరోసా, ప్రభుత్వ అండ ఏదీ దక్కలేదని ఆరోపించారు. రైతుల పక్షాన తాము నిలబడతామని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయరో చూస్తామని... వారి కోసం మొదలు పెట్టిన పోరాటం ఇక ఆగదని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందన్నారు. పొగాకు రైతుల నుంచి వరి, పత్తి, కొబ్బరి, మిర్చి, ఉల్లి, టమాటా వరకు అన్ని పంటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపులతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 2023-24లో పొగాకు సగటు ధర కిలోకు రూ.289 ఉండేదని... గరిష్ట ధర రూ.411 వరకు నమోదైందని గుర్తు చేసారు. కానీ ఈరోజు అదే సగటు ధర రూ.214కు పడిపోయిందని చెప్పుకొచ్చారు. ఉత్తరాది ప్రాంతంలో రూ.326 ఉన్న ధర ఇప్పుడు రూ.236కు క్షీణించిందని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించారు.
అసెంబ్లీకి జగన్, నిర్ణయం వెనుక- కీలక మంత్రాంగం..!!
టొబాకో బోర్డు 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని... కానీ ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమేనని జగన్ వివరించారు. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల ఉత్పత్తిలో కేవలం 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ఉత్తరాది ప్రాంతంలో 83 మిలియన్ కిలోల ఉత్పత్తి కాగా 105 రోజుల వేలంలో కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలేనని వివరించారు. రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్‌కు అదనంగా సంవత్సరానికి రూ.20 వేల చొప్పున 'అన్నదాత సుఖీభవ' ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేల ఎగవేశారని విమర్శించారు. రైతు హక్కుల కోసం తమ పోరాటం ఆగదని.. వైసీపీ ఎప్పుడూ రైతు పక్షాన నిలుస్తుందని జగన్ హామీ ఇచ్చారు.ప్రభుత్వానికి జగన్ అల్టిమేటం