ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ మధ్య 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూటమి నేతలు చెబుతున్నారు. తామే అధికారంలోకి వచ్చేదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పటికే కీలక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గం పై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టారు. కీలక నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. మూడు సర్వే సంస్థలతో ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. వారికి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల పైన వైసీపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వైసీపీ కాపు నేతలు తాజాగా సమావేశం నిర్వహించారు. ఇక.. ఇప్పుడు బీసీ నేతలు వచ్చే నెల 9న విజయవాడలో భారీ సభకు నిర్ణయించారు. కోనసీమ నేతలతో సమావేశం నిర్వహించిన జగన్ స్థానిక పరిస్థితుల పైన చర్చించారు. స్థానిక ఎన్నికల కోసం నేతలకు దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలకు జగన్ సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఉండి నియోజకవర్గానికి సమన్వయకర్తను మార్పు చేసారు.
విజయవాడ మీదుగా బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, ముహూర్తం ఫిక్స్..!!
ఉండి నియోజకవర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు 2024 ఎన్నికల్లో 56,777 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రఘురామ పైన వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 60,125 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచే నరసింహరాజు పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీ నుంచి మంతెన రామరాజు 10,949 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తరువాత ఉండిలో ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దీంతో.. ప్రస్తుతం అక్కడ ఇంఛార్జ్ గా ఉన్న పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ (బాబు)ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని చెబుతున్న వేళ.. 2029 నాటికి మొత్తం రాజకీయ ముఖచిత్రమే మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఉండి నియోజకవర్గంలో జగన్ తాజా గా చేసిన నియామకం.. రాజకీయంగా ఎంత వరకు కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.గోదావరి జిల్లాల పై జగన్ ఫోకస్