'మావిగన్' చట్టం సాధ్యమేనా, జగన్ ధీమా వెనుక- అసలు లెక్క..!!

మావిగన్: ఏపీ రాజధానిగా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ నినాదం. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పైన కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సమర్థిస్తూ వాదనలు చేస్తోంది. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేసిన తరువాత జగన్ ఈ ప్రకటన వెనుక అంతర్యం ఏంటనేది చర్చ. అయితే.. జగన్ ఆషామాషీగా ఈ ప్రకటన చేయలేదనే వాదన వినిపిస్తోంది. అసలు జగన్ ధీమా ఏంటి.. ఈ ప్రకటన వెనుక లెక్కలేంటి...

Advertisement

మాజీ సీఎం జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ ప్రతిపాదన చేసారు. వచ్చే ఎన్నిక ల్లో తాము మావిగన్ అంశంతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. అమరావతి రైతులకు తాము మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. అయితే.. దీని పైన కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ అర్దం లేని వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ వ్యూహం వెనుక భారీ లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. రెండు లక్షల కోట్ల ఖర్చుతో చేసే నిర్మాణం కంటే... ఈ ప్రతిపాదనతో తక్కువ ఖర్చుతో పాలనా వికేంద్రీకరణ తో రాజధాని అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మావిగన్ పరిధి మొత్తం 110 కి.మీ. ఇప్పటికే హైవే ఉంది. ఈ 110 కి.మీ. హైవేకి అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద ప్రకటిస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని విశ్లేషిస్తున్నారు.

Advertisement

అదే విధంగా విజయవాడ, దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా ఎదుగుతుందని వివరిస్తున్నారు. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే సరిపోతుందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధుల్లో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

రాజధాని 29 గ్రామాల కు పరిమితం చేస్తున్నారని.. ఇందు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనేది వైసీపీ వాదన. కాగా, మావిగన్ రెండు జిల్లాల పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే.. రాజకీయంగానూ కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం అమరావతిలో నెలకొన్ని పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

మావిగన్ పరిధిలో రెండు జిల్లాలు వస్తాయి. పోర్టు.. రైలు, రోడ్డు, ఏయిర్ కనెక్టివిటీ సులభంగా ఉన్న ప్రాంతంగా వివరిస్తున్నారు. ఇదే సమయంలో తమ సీఆర్డీఏ రీజియన్ పరిధి గురించి కూటమి నేతలు వివరిస్తున్నారు. తేడా ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ మాత్రం నేరుగా ఈ రెండు జిల్లాల ప్రస్తావన చేయటం ద్వారా అమరావతి విషయంలో తన పైన ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవటం తో పాటుగా.. వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే వాదన ఉంది. రెండు జిల్లాల పరిధిలో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమరావతి కోర్ కేపిటల్ రెండు నియోజకవర్గాల పరిధి లో ఉంది.

Advertisement

అదే సమయంలో అమరావతిలో అవినీతి ఆరోపణలు.. రైతుల నుంచి తాజాగా వస్తున్న స్పందనలతో జగన్ ఈ తరహా ప్రకటన చేసారని చెబుతున్నారు. అయితే..అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్దత లభించింది. మరి, మావిగన్ కు ఎలా సాధ్యం అనేది కీలక ప్రశ్న. అదే విధంగా ఇప్పటికే అమరావతిలో భారీ ఖర్చుతో చేసిన నిర్మాణాలు ఏం చేస్తారు.. రైతులకు న్యాయం అంటే ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలో చోటు చేసుకునే పరిణామాలు మరింత ఆసక్తిగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

English Summary

YSRCP Chief YS Jagan's 'Mavigun' Announcement Sparks Debate Over Political Strategy and Vote-Bank Calculations