కార్ల కంపెనీల ఓకే అంటున్నా.. కస్టమర్లు మాత్రం లబోదిబో: అసలేంటీ E20 పెట్రోల్ వివాదం!

దేశంలో E20 పెట్రోల్ వాడకంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని.. కాలుష్యం అదుపులోకి వస్తుందని.. ఈ ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. E20 ఇంధనాలకు అనుకూలంగా తయారు చేసిన తమ సరికొత్త వాహనాలకు దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని.. ఈ కొత్త మార్పుకు తమ కార్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో వాహనదారుల అభిప్రాయాలు, అనుభవాలు మాత్రం కంపెనీల వాదనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

Advertisement

ఈ వివాదం ఇటీవల బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ వీడియోతో మరింత వేడెక్కింది. టొయోటా సర్వీస్ సెంటర్లో రికార్డ్ చేసిన ఆ వీడియోలో.. ఈ20 పెట్రోల్ వాడటం వల్లే తన కారు ఇంజన్ పాడైపోయిందని ఆయన ఆరోపించారు. దీనిపై టొయోటా కంపెనీ వెంటనే స్పందించింది. కారులో సమస్య E20 ఇంధనం వల్ల రాలేదని.. పెట్రోల్‌లో కల్తీ, చెత్త, ఇతర వ్యర్థాలు ఉండటం వల్లే ఇంజన్ దెబ్బతిందని క్లారిటీ వచ్చింది. టొయోటా తర్వాత ఇప్పుడు మరో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ అంశంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తమ వాహనాల భద్రత, నాణ్యత, పనితీరుకు తాము ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఇస్తామని మహీంద్రా పేర్కొంది. తమ వినియోగదారులకు భరోసా ఇస్తూ.. మహీంద్రాకు చెందిన అన్ని E20-కంప్లయింట్ వాహనాలను ఈ ఇంధనంతో కఠినమైన పరీక్షలు జరిపిన తర్వాతే మార్కెట్లోకి తెచ్చినట్లు మహీంద్రా కంపెనీ స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రతకు పర్యావరణ పరిరక్షణకు E20 ఇంధనం వైపు అడుగులు వేయడం చాలా కీలకమైన నిర్ణయమని.. బాధ్యతాయుతమైన కంపెనీగా తాము ఈ మార్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు మహీంద్రా కంపెనీ వెల్లడించింది.

ప్రభుత్వం, కంపెనీలు ఈ20 పెట్రోల్‌ను సమర్థిస్తున్నప్పటికీ.. వాహనదారుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 'లోకల్ సర్కిల్స్" అనే సంస్థ జూన్ 2026లో దేశంలోని 316 జిల్లాల్లోని 22,567 మంది పెట్రోల్ వాహనదారుల అభిప్రాయాలను సేకరిస్తూ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. దాదాపు 53 శాతం మంది పెట్రోల్ వాహనదారులు రోడ్డు రవాణా, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు E20 పెట్రోల్‌ను అమలు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ప్రక్రియ చాలా అధ్వాన్నంగా లేదా అసమర్థంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఇందులో 42 శాతం మంది ఈ రోలౌట్ విధానానికి అత్యంత చెత్త రేటింగ్ ఇవ్వగా.. కేవలం 13 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు.

Advertisement

వాహనాల మైలేజ్, మెయింటెనెన్స్‌పై E20 పెట్రోల్ తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన వాహనాలు ఉన్నవారిలో 66 శాతం మంది.. ఈ పెట్రోల్ వాడటం వల్ల తమ బండ్ల మైలేజ్ 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయిందని ఫిర్యాదు చేశారు. అలాగే 45 శాతం మంది పాత వాహనదారులు E20 పెట్రోల్ వల్ల కారు రిపేర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో అందరికీ విధిగా E20 పెట్రోల్ కాకుండా .. పాత వాహనాల కోసం ఇథనాల్ లేని E0 లేదా తక్కువ ఇథనాల్ ఉండే E10 పెట్రోల్ ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచాలని 31 శాతం మంది వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

English Summary

The row over E20 petrol intensifies in India. While auto giants like Toyota and Mahindra assure vehicle safety, a survey reveals that 66% of pre-2023 vehicle owners faced a drop in mileage.