EPFO: వడ్డీ డబ్బులు పడ్డాయ్..! జమ కాని వాళ్లు కంగారు పడకండి

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ(EPFO) తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రకటించిన 8.25 శాతం వార్షిక వడ్డీని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా మంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. జులై 15వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో ఈ వడ్డీ పూర్తిగా జమ కానుంది. ఇప్పటికే సుమారు 80 శాతం మంది ఖాతాల్లో వడ్డీ సొమ్ము క్రెడిట్ అయినట్లు సంస్థ వెల్లడించింది. మొత్తం రూ.1.44 లక్షల కోట్లకు పైగా నిధులను చందాదారుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.

Advertisement

ఈసారి ఈపీఎఫ్‌ఓ సరికొత్త 'సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్' (CITES) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న వికేంద్రీకృత వ్యవస్థ స్థానంలో.. దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల రికార్డులన్నింటినీ ఒకే లొకేషన్‌కు చేర్చారు. దీనివల్ల చందాదారులకు ఒకే పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్ వివరాలన్నీ సులభంగా చూసుకునే వీలుంటుంది. అంతేకాదు, డబ్బులు విత్‌డ్రా చేసుకునే సమయంలో అర్హతలను సిస్టమే ఆటోమేటిక్‌గా ముందే వెరిఫై చేస్తుంది. దీనివల్ల క్లెయిమ్‌లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

Advertisement

మీ ఖాతాలో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ అకౌంట్‌లో వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే మీ 'యూఏఎన్' (UAN) నంబర్ యాక్టివేట్‌లో ఉండాలి. కింద పేర్కొన్న సులువైన పద్ధతుల ద్వారా మీ బ్యాలెన్స్‌ను క్షణాల్లో తెలుసుకోవచ్చు

EPFO పోర్టల్ ద్వారా:

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆధార్ లింక్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసాక, స్క్రీన్‌పై కనిపించే 'View Passbook' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మీ ఖాతాలో జమ అయిన వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ కనిపిస్తుంది. (పాస్ బుక్ సేవల్లో అంతరాయం ఇంకా కనిపిస్తుంది. వడ్డీ జమ అయిన సమాచారం నేపథ్యంలో చాలా మంది లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోర్టల్ ప్రస్తుతానికి నిదానంగా పనిచేస్తుంది)

Advertisement

ఉమాంగ్ (UMANG) యాప్:

మీ మొబైల్‌లో ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, మీ యూఏఎన్ నంబర్‌ను లింక్ చేయాలి. యాప్‌లో 'PF Balance' క్లిక్ చేయగానే గత మూడు నెలల లావాదేవీలు కనిపిస్తాయి. పూర్తి వివరాల కోసం పాస్‌బుక్ పీడీఎఫ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సింపుల్‌గా SMS ద్వారా:

ఇంటర్నెట్ లేకపోయినా మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 7738299899 అనే నంబర్‌కు మెసేజ్ పంపి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మెసేజ్ బాక్స్‌లో (EPFOHO UAN 00000) (చివరి సున్నాల ప్లేస్ లో మీ UAN నంబర్) టైప్ చేసి పంపాలి (చివరన TEL అని టైప్ చేస్తే వివరాలు తెలుగులో వస్తాయి).

Advertisement

కాల్ చేసి:

9966044425 నంబర్ కు మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి మిసిడ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రస్తుతం నిరంతరాయంగా కొనసాగుతోంది. అందువల్ల కొంతమంది పాస్‌బుక్‌లలో వడ్డీ మొత్తం వెంటనే అప్‌డేట్ కాకపోవచ్చు. దీనికి కంగారు పడాల్సిన పనిలేదని, ఒకట్రెండు రోజులు ఆగి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అప్‌డేట్ అయిన మొత్తం కనిపిస్తుందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.

English Summary

EPFO begins crediting 8.25% interest for FY 2025-26 into 34 crore accounts through the new CITES system. Learn 3 simple ways to check your EPF balance online. EPFO