నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం.. మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్!

తెలుగు రాష్ట్రాల ప్రముఖ వ్యాపారవేత్త, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అంతర్జాతీయ స్థాయిలో చాలా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ - 2026' జాబితాలో ఆమె చోటు సంపాదించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఆ అవార్డుల ప్రధానం కార్యక్రమంలో... భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తూ, దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న టాప్-100 మహిళా పారిశ్రామికవేత్తల లీగ్‌లో బ్రాహ్మణి నిలవడం విశేషం. దిల్లీలో వైభవంగా జరిగిన ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో ఆమెకు ఈ అరుదైన అవార్డును అందజేశారు.

Advertisement

ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన ఈ విజయం వెనుక లక్షలాది మంది అన్నదాతల కష్టం ఉందన్నారు. పాల ఉత్పత్తి రంగంలో సరికొత్త సాంకేతికతను జోడిస్తూనే.. రైతులకు స్థిరమైన ఉపాధిని, దేశానికి నాణ్యమైన పోషకాలను అందించడమే తమ 35 ఏళ్ల సంస్థ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, నమ్మకమైన రైతులకు, ఉద్యోగులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

అత్తమ్మే నా బలం.. భార్య విజయంపై లోకేష్ మురిపెం!

ఈ సుదీర్ఘ పారిశ్రామిక ప్రస్థానంలో తనకు అండగా నిలిచిన తన అత్తయ్య, నారా భువనేశ్వరికి బ్రాహ్మణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో ప్రతి అడుగులోనూ ఆమె అందించిన మార్గదర్శకత్వం, మద్దతు వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగానని, భువనేశ్వరి గారే తన కంతటికీ పెద్ద బలం, వెన్నుముక అని బ్రాహ్మణి భావోద్వేగానికి లోనయ్యారు.

మరోవైపు తన భార్య సాధించిన ఈ అసాధారణ ఘనతపై రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రతిష్టాత్మక జాబితాలో బ్రాహ్మణి నిలవడం తమ కుటుంబానికే కాకుండా తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె తన నాయకత్వ లక్షణాలతో మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు. డెయిరీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న హెరిటేజ్ ఫుడ్స్.. కేవలం లాభాల కోసమే కాకుండా, పారదర్శక వ్యాపార విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఈ అవార్డు ద్వారా మరోసారి నిరూపితమైంది.

English Summary

Heritage Foods Executive Director Nara Brahmani features in Fortune India's Most Powerful Women 2026 list. Minister Nara Lokesh expresses pride in her milestone achievement.