40 ఏళ్ల దరిద్రంలోకి ఆ దేశం.. కనిష్టానికి పడిపోయిన కరెన్సీ విలువ

దశాబ్దాలుగా అత్యల్ప వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్య విధానాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సురక్షిత స్వర్గధామంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుకుంది. ఆ దేశ ప్రభుత్వ రుణాల ప్రాథమిక వ్యయం ఏకంగా ముప్పై ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో, జపాన్ భారీ సావరిన్ అప్పులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జాతీయ కరెన్సీ 'యెన్' విలువ రికార్డు స్థాయిలో పతనం కావడం, మరోవైపు బాండ్ల దిగుబడి (Bond Yields) రాకెట్ వేగంతో దూసుకెళ్లడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తోంది.

Advertisement

జపాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మితిమీరిన వ్యయ విధానాలు, బ్యాంకు ఆఫ్ జపాన్ (BOJ) దశాబ్దాల కాలం నాటి ఉదార ద్రవ్య విధానాలకు స్వస్తి పలకడం ఇన్వెస్టర్లలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ప్రస్తుతం జపాన్ 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ దిగుబడి ఏకంగా 2.85 శాతానికి చేరింది. ఇది 1996 సంవత్సరం తర్వాత, అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలంలో అత్యధిక రేటు కావడం గమనార్హం. సుదీర్ఘకాల పరిమితి గల బాండ్లు కూడా సరికొత్త గరిష్టాలను తాకుతుండటంతో పెట్టుబడిదారులు జపాన్ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ప్రధాని 'తకైచి' ప్యాకేజీ.. జీడీపీని మించిన అప్పుల గుట్ట!

ప్రస్తుతం జపాన్ ప్రభుత్వ అప్పులు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 200 శాతానికి పైగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుణభార దేశాల్లో ఒకటిగా ఉన్న జపాన్‌కు పెరిగిన బాండ్ దిగుబడులు ఇప్పుడు పెద్ద శాపంగా మారనున్నాయి.

నిపుణుల హెచ్చరిక:

ప్రధాని సనాయ్ తకైచి ప్రవేశపెట్టాలని భావిస్తున్న దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ దేశాన్ని మరింత అప్పుల్లోకి నెట్టే ప్రమాదముంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే, ప్రభుత్వం చెల్లించే వార్షిక వడ్డీలే వేగంగా పెరిగితే జపాన్ ఆర్థిక మూల స్థంభాలు కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

40 ఏళ్ల కనిష్టానికి 'యెన్'.. ద్రవ్యోల్బణం గుప్పిట్లో దేశం!

సాధారణంగా కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు బాండ్ల ధరలు ఏకకాలంలో పతనం కావడం ఆర్థిక శాస్త్రంలో చాలా అరుదుగా జరుగుతుంది. కానీ, జపాన్ లో ఇప్పుడు ఇదే విచిత్ర పరిస్థితి నెలకొంది. కరెన్సీని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఎన్నో నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ.. యెన్ విలువ ఏకంగా 40 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి, నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వడ్డీ రేట్లను మరింతగా పెంచక తప్పని ఒత్తిడి బ్యాంక్ ఆఫ్ జపాన్‌పై పడింది. గత నెలలోనే కేంద్ర బ్యాంకు కీలక మార్కెట్ వడ్డీ రేట్లను ఒక శాతానికి పెంచి, పాత విధానాలకు ముగింపు పలికింది.

Advertisement

ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు!

జపాన్ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఈ భూకంపం కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా అమెరికా, బ్రిటన్, ఐరోపా మార్కెట్లను సైతం ముంచేసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు పెట్టిన జపాన్ ఇన్వెస్టర్లు, ఇప్పుడు స్వదేశంలో బాండ్ దిగుబడులు ఆకర్షణీయంగా మారడంతో విదేశీ నిధులను ఉపసంహరించుకుని జపాన్‌కు తరలించే (Capital Repatriation) యోచనలో ఉన్నారు. ఇదే గనుక జరిగితే అంతర్జాతీయంగా రుణాల వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి గ్లోబల్ మార్కెట్లు సంక్షోభంలో పడతాయి. పరిస్థితులను అదుపు చేయడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ బాండ్ల కొనుగోళ్లను నెమ్మదింపజేస్తున్నప్పటికీ, గ్లోబల్ ఇన్వెస్టర్లు మాత్రం జపాన్ బాండ్ మార్కెట్ కదలికలపై నిశితమైన డేగకన్ను వేశారు.

English Summary

Japan faces a historic economic crisis as government bond yields hit a 30-year high, the Yen crashes to a 40-year low, and soaring sovereign debt threatens global financial markets. జపాన్.. ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుకుంది.