మన ఆస్తులను మన తదనంతరం ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించే వీలునామా అనగానే చాలామందికి కోర్టులు, లాయర్లు, బాండ్ పేపర్లు, కంప్యూటర్ ప్రింటౌట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. లాయర్ దగ్గరకు వెళ్లి లీగల్ భాషలో టైప్ చేయిస్తేనే ఆ కాగితానికి విలువ ఉంటుందని భావిస్తుంటారు. కానీ, అది కేవలం ఒక అపోహ మాత్రమే! భారతీయ చట్టాల ప్రకారం రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ తెల్ల కాగితంపై మీ స్వహస్తాలతో రాసిన వీలునామా కూడా చట్టబద్ధంగా పూర్తిగా చెల్లుబాటు అవుతుంది.
వీలునామా కంప్యూటర్‌లో టైప్ చేశారా లేక పెన్నుతో రాశారా అనేది ముఖ్యం కాదు, చట్టపరమైన నిబంధనలు పాటించారా లేదా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఆస్తి యజమాని తన స్వహస్తాలతో రాసిన పత్రం కింద కచ్చితంగా సంతకం చేయాలి, లేదా స్పష్టమైన వేలిముద్ర వేయాలి. దీనికంటే అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. కనీసం ఇద్దరు సాక్షులు ఆ యజమాని సంతకం చేయడాన్ని ప్రత్యక్షంగా చూడాలి. అనంతరం ఆ ఇద్దరు సాక్షులు కూడా యజమాని సమక్షంలోనే ఆ కాగితంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాగితంపై "నా ఇల్లు నా కూతురికే చెందుతుంది" అని స్పష్టంగా రాసినా.. సాక్షుల సంతకాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో అది చెల్లకుండా పోయే ప్రమాదముంది.
చాలామంది వీలునామాను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేయించకపోతే అది వేస్ట్ అని అనుకుంటారు. కానీ, చట్ట ప్రకారం వీలునామాను రిజిస్టర్ చేయించడం తప్పనిసరేమీ కాదు. రిజిస్ట్రేషన్ లేకపోయినా పైన చెప్పిన సాక్షుల ప్రక్రియ సరిగ్గా ఉంటే అది పూర్తి చట్టబద్ధమైనదే. అయితే, ఆస్తి రాసిచ్చిన వ్యక్తి తీవ్ర అనారోగ్యంలో ఉన్నప్పుడు లేదా ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడిన సమయంలో ఉన్నట్టుండి వీలునామా రాస్తే మాత్రం కోర్టుల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. యజమాని పూర్తి స్పృహతో, తన సొంత ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. సాధారణ కాగితమే కదా అని నిర్లక్ష్యంగా రాయకూడదు. వీలునామా రాసేటప్పుడు మీ పేరు, వివరాలు, ఆస్తుల సమాచారం, ఎవరికి ఏ ఆస్తి ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా పేర్కొనాలి. సందేహాలకు తావులేకుండా రాస్తేనే రేపటినాడు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావు. వీలునామాలో ఉన్న ప్రతి పేజీపైనా యజమాని సంతకం చేయడం, లబ్ధిదారులతో సంబంధం లేని తటస్థ వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోవడం ఎంతో మంచిది. అలాగే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం లేదా కొత్త ఆస్తులు కొన్నప్పుడు పాత వీలునామాను సమీక్షించుకుని అవసరమైతే మార్చుకోవచ్చు. సంతకాలు, సరైన సాక్ష్యాలు ఉన్నంతకాలం మీ చేతిరాతతో రాసిన కాగితమే అత్యంత శక్తివంతమైన లీగల్ డాక్యుమెంట్‌గా పనిచేస్తుంది.వీలునామా రాస్తున్నారా? ఈ చిన్న తప్పులు చేస్తే ఆస్తి పోతుంది జాగ్రత్త!
రిజిస్ట్రేషన్ తప్పనిసరా? వివాదాలు ఎప్పుడు వస్తాయి?
వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?
అవాంతరాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?