దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!

భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన సత్తా చాటింది. దేశీయంగా వ్యాపార లావాదేవీలు పుంజుకోవడంతో పాటు దిగుమతులు గణనీయంగా పెరగడంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆకాశాన్ని తాకాయి. గత జూలై నెలకు గాను ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 14 నెలల కాలంలో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు ఇదే కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 2 లక్షల కోట్ల దాటడం ఇది రెండోసారి.

Advertisement

గత ఏడాదితో పోలిస్తే జూలై నెలలో మొత్తం జీఎస్టీ రాబడి ఏకంగా 15.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన దిగుమతులపై వచ్చే పన్ను ఏకంగా 28.8 శాతం పెరిగి రూ. 66,511 కోట్లకు చేరింది. దీనికి తోడు దేశీయ వ్యాపార లావాదేవీల ద్వారా లభించే ఆదాయం కూడా 10.1 శాతం వృద్ధితో రూ. 1.45 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశంలో ప్రజల కొనుగోలు శక్తి, ఆర్థిక కార్యకలాపాలు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయో స్పష్టం చేస్తోంది.

Advertisement

GST చరిత్రలో బిగ్గెస్ట్ రికార్డ్. ఏప్రిల్‌లో ఏకంగా...

జూన్ కంటే మెరుగ్గా.. ఆర్థిక సంవత్సరంలో రెండోసారి రికార్డ్

జూన్ నెలలో జీఎస్టీ రాబడి రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదు కాగా, జూలై నాటికి ఇది రూ. 2.11 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో (ఏప్రిల్‌లో) ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో రూ. 2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఆ తర్వాత మే నెలలో రూ. 1.94 లక్షల కోట్లు, జూన్‌లో రూ. 1.95 లక్షల కోట్లు వసూలు కాగా.. జూలైలో మళ్లీ రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటి దూసుకెళ్లింది.

Advertisement
నేటి నుంచి కొత్త రూల్స్.. అర్థరాత్రి నుంచే మారిన బ్యాంకింగ్,తత్కాల్ బుకింగ్స్‌

రీఫండ్లు పోను నికర ఆదాయం ఎంతంటే?

వ్యాపారులకు చెల్లించిన రీఫండ్లను తీసివేసిన తర్వాత జూలైలో ప్రభుత్వానికి వచ్చిన నికర జీఎస్టీ రాబడి రూ. 1.81 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 15.8 శాతం ఎక్కువ. ఈ నెలలో మొత్తం రూ. 29,968 కోట్ల మేర రీఫండ్లు జారీ చేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల (ఏప్రిల్-జూలై) కాలాన్ని పరిశీలిస్తే, మొత్తం జీఎస్టీ రాబడి 10.1 శాతం పెరిగి రూ. 8.43 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి రూ. 7.66 లక్షల కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈ ఏడాది స్థిరమైన వృద్ధితో కేంద్ర, రాష్ట్ర ఖజానాలు కళకళలాడుతున్నాయి.

English Summary

India's GST collections surged 15.4% year-on-year to reach Rs 2.11 lakh crore in July, marking a 14-month high and crossing the Rs 2 lakh crore mark for the second time this fiscal year.