మొబైల్ రీఛార్జీల రేట్లు ఇక చేతికి అందవు- ఒకదాని తర్వాత ఒకటి

దేశంలో మొబైల్ వినియోగదారులపై త్వరలోనే మరింత ఆర్థిక భారం పడనుంది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో మొబైల్ టారిఫ్ ధరలు మరో 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్‌ తాజాగా విశ్లేషించింది. ఈ ప్రైసింగ్ మార్పుల వల్ల టెలికాం పరిశ్రమలో సేవల నాణ్యత మెరుగుపడటంతో పాటు రాబోయే రోజుల్లో కంపెనీల ఆదాయాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

Advertisement

కొద్దిరోజుల కిందటే మొబైల్ టారిఫ్ గణనీయంగా పెరిగింది. ఈ పెంపు ద్వారా భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీల ప్రతి యూజర్ సగటు ఆదాయం జూన్ త్రైమాసికంలో ఒకటి నుంచి 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. సాధారణ వినియోగదారులు పాత 2జీ నెట్‌వర్క్‌ల నుంచి 4జీ, 5జీకి అప్‌గ్రేడ్ కావడం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

Advertisement

ఇప్పుడు తాజాగా మరోసారి ఛార్జీలను పెంచాలని ఆయా కంపెనీలన్నీ కూడా ప్రతిపాదనలను సిద్ధం చేశాయని, వీటికి ఆమోదం లభించడం లాంఛనప్రాయమేనని సెంట్రమ్ వెల్లడించింది. ఈ పెంపు తర్వాత రెండో త్రైమాసికం నాటికి మరో రెండు శాతం వరకు ఆయా కంపెనీల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడింది.

ఈ వినియోగదారుల వృద్ధిలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీలు దూకుడును కొనసాగిస్తోన్నాయి. తమ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఈ రెండు సంస్థలు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో జియో సుమారు 70 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకోనుండగా, ఎయిర్‌టెల్ దాదాపు 50 లక్షల మందిని సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా రెండు లక్షల మంది వినియోగదారులను మాత్రమే ఆకర్షించగలదని తెలుస్తోంది.

Advertisement

టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూడా దేశీయ టెలికాం రంగానికి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మే నెలలో కొత్తగా 50.9 లక్షల మంది యూజర్లు చేరడంతో దేశంలో మొత్తం వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య 129 కోట్లకు పెరిగింది. ఈ చేరికలలో ఎయిర్‌టెల్ 29 లక్షల మందితో అగ్రస్థానంలో నిలవగా, జియో 21.5 లక్షల మంది కొత్త సైన్-అప్‌లతో తర్వాతి స్థానంలో నిలిచింది.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ మొబైల్ మార్కెట్ వృద్ధి అత్యధికంగా నెలకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 45.8 లక్షల కనెక్షన్లు కొత్తగా రాగా, గ్రామీణ మార్కెట్లలో 9.3 లక్షలుగా నమోదైంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా లక్షకు పైగా నూతన సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్నాయి. ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని దాదాపు 90 శాతం పైగా జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్ కవరేజీని పూర్తి చేశాయి. తమ నెట్‌వర్క్‌లలో 5జీ స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని పెంచడంపై ప్రస్తుతం దృష్టి సారించాయి. వొడాఫోన్ ఐడియా కూడా 100 నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది.

English Summary

Mobile Recharge Set for Fresh Jump as Centrum Predicts 12 to 15 Percent Price Increase Soon Airtel, Jio and Vodafone Idea. The forecast highlights potential tariff hikes and changing pricing conditions in the India telecom sector, which may influence customer costs and operator strategies.