పాత బట్టలకు గిన్నెలు, గ్లాసులు: మరి ఆ బట్టలతో ఏం చేస్తారో తెలుసా?

ఇండియాలోని ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ.. పాత బట్టలకు గిన్నెలు, బకెట్లు, గ్లాసులు లేదా ఇంటి సామాన్లు తీసుకోండి అంటూ అరిచే మహిళలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇంట్లో వాడకుండా పడేసిన లేదా పాత బట్టలను ఇచ్చి మహిళలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుంటారు. అయితే ఈ పాత బట్టలన్నీ ఎక్కడికి వెళ్తాయి? వాటిని పారేస్తారా లేక మరేదైనా చేస్తారా? అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఈ బట్టల వెనుక ఓ పెద్ద సరఫరా వ్యవస్థ ఉంటుంది. అక్కడ బట్టల నాణ్యతను బట్టి వాటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. దీని వల్ల వేలాగి మందికి ఉపాధి లభించడమే కాకుండా.. పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

Advertisement

మొదటి దశ.. బట్టల వర్గీకరణ
మహిళలు ఇళ్ల నుంచి సేకరించిన పాత బట్టలను పెద్ద వ్యాపారులకు లేదా గోదాములకు విక్రయిస్తారు. అక్కడ మొదటగా బట్టలన్నింటినీ రకాల వారీగా వేరు చేస్తారు. బాగున్నవి, దాదాపు కొత్తవిగా కనిపించే బ్రాండెడ్ బట్టలను ఓ పక్కన పెడతారు. చిరిగిపోయిన, పనికిరాని బట్టలను మరో విభాగానికి పంపుతారు. మంచి స్థితిలో ఉన్న బట్టలను డ్రైక్లీనింగ్ లేదా శుభ్రం చేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో అమ్మకానికి సిద్ధం చేస్తారు. మన దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి పాత బట్టల మార్కెట్లు ఉంటాయి. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు, కార్మికులు, విద్యార్థులు చాలా తక్కువ ధరకే లభించే ఈ బట్టలను ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తారు.

Advertisement

పనికిరాని బట్టల నుంచి దారాల తయారీ
ఇక ఏ మాత్రం వేసుకోవడానికి పనికిరాని స్థితిలో ఉన్న బట్టలను కూడా వృథాగా పారేయరు. వాటిని పెద్ద పెద్ద మెషీన్లలో వేసి చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. ఆ తర్వాత వాటి నుంచి పీచు తీస్తారు. ఆ పీచును శుభ్రం చేసిన మళ్లీ కొత్త దారాలను తయారు చేస్తారు. ఇలా ఉత్పత్తి చేసిన దారాలతో డోర్ మ్యాట్లు, తివాచీలు, తుడిచే గుడ్డలు, కంబళ్లు, పరుపులు-దిండ్లలో దూది లాగా నింపే మెటీరియల్, ఇండస్ట్రియల్ దుస్తులను తయారు చేస్తారు. కాటన్, ఉన్ని వంటి సహజమైన బట్టలను మళ్లీ దారాలుగా మార్చడం సులభం. కానీ పాలిస్టర్, నైలాన్ లేదా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ బట్టలను రీసైకిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి వీటి కోసం అధునాతన సాంకేతికతను, మెషీన్లను ఉపయోగిస్తారు.

Advertisement

వివిధ ఇండస్ట్రీల్లో వాడకం
రీసైక్లింగ్ ద్వారా తయారైన దారాల ఉపయోగం కేవలం తివాచీలు, కంబళ్ల తయారీకే పరిమితం కాలేదు. ఆటోమొబైల్ పరిశ్రమలో కార్ల సీట్ల ఫిల్లింగ్ కోసం, ఫర్నిచర్ తయారీలో, ప్యాకింగ్ మెటీరియల్‌గా, ఇన్సులేషన్, అనేక పారిశ్రామిక ఉత్పత్తులలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల కంపెనీలకు కొత్త ముడిసరుకు అవసరం తగ్గి, తయారీ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

పర్యావరణానికి ఎంతో మేలు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల టన్నుల బట్టలు వ్యర్థాలుగా మారుతున్నాయి. వీటిని నేరుగా చెత్తలో పడేస్తే కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా ఈ పాత బట్టలను రీసైకిల్ చేయడం ద్వారా కొత్త బట్టల తయారీకి అవసరమయ్యే నీరు, విద్యుత్ శక్తి ముడిసరుకు ఆదా అవుతాయి. కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. బట్టలను పారేయడం కంటే వాటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడటమే పర్యావరణానికి అత్యంత సురక్షితమైన మార్గమని సైంటిస్టుల పరిశోధనల్లో కూడా తేలింది.

Advertisement

లక్షలాది మందికి ఉపాధి మార్గం
ఈ పాత బట్టల బిజనెస్ వెనుక ఓ పెద్ద ఉపాధి రంగం దాగి ఉంది. ఇళ్లలో తిరిగి బట్టలు సేకరించే మహిళ నుంచి గోదాముల్లో వాటిని వేరు చేసే కార్మికులు, సెకండ్ హ్యాండ్ మార్కెట్ వ్యాపారులు, రీసైక్లింగ్ ఫ్యాక్టరీల యజమానులు, తివాచీలు అల్లే చేతివృత్తి కళాకారుల వరకు లక్షలాది మందికి ఇది జీవనోపాధిని అందిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కూడా దుస్తుల వ్యర్థాలు తగ్గించడానికి.. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి సరికొత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పాత బట్టలకు బదులు గిన్నెలు తీసుకోవడం అనేది కేవలం ఓ చిన్న వ్యాపారం మాత్రమే కాదు.. పర్యావరణాన్ని కాపాడుతూ పాత వస్తువులకు కొత్త రూపాన్ని ఇచ్చే అద్భుతమైన రీసైక్లింగ్ నెట్వర్క్ లాంటిది.

English Summary

Old Clothes for Utensils, Discover the hidden supply chain and recycling network behind the exchange of old clothes for steel utensils, from second-hand markets to industrial use.