EPFO: పాస్ బుక్ ఎప్పుడొస్తుంది? మెంబర్ పోర్టల్‌లో సూపర్ మార్పులు..

EPFO ఖాతాదారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈపీఎఫ్‌వో (EPFO) ఆన్‌లైన్ సేవలు ఎట్టకేలకు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక వ్యవస్థను ఆధునీకరించేందుకు సర్వర్లను నిలిపివేసిన సంస్థ.. శుక్రవారం (జులై 3) నుంచి మెంబర్, ఎంప్లాయర్ పోర్టల్ సేవలను తిరిగి కొత్తగా మన కోసం తీసుకువచ్చింది. అయితే, కొత్త సాఫ్ట్‌వేర్ పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని, అందువల్ల పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal) వంటి క్లెయిమ్‌ల పరిష్కారంలో కనీసం రెండు వారాల పాటు ఆలస్యం కావచ్చని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.

Advertisement

మెరుగైన డిజిటల్ సేవలు, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం జూన్ 26 నుంచి సర్వర్లను నిలిపివేసి పెద్ద ఎత్తున టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ను చేపట్టారు. జులై 1 నుంచే ఇవి అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమై జులై 3న సేవలు ప్రారంభమయ్యాయి. సాఫ్ట్‌వేర్ మార్పుల వల్ల క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌కు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుందని, చందాదారులు సహకరించాలని అధికారులు కోరారు. అలాగే, వెబ్‌సైట్‌పై లోడ్ పడకుండా ఉండేందుకు రద్దీగా ఉండే సమయాల్లో పదే పదే వెబ్‌సైట్ ఓపెన్ చేయవద్దని సూచించారు.

Advertisement

మెంబర్ పోర్టల్‌లో వచ్చిన సూపర్ మార్పులు ఇవే:

కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన పోర్టల్‌లో పాత సమస్యలను దూరం చేస్తూ ఖాతాదారుల కోసం చాలా ఉపయోగకరమైన మార్పులు తీసుకొచ్చారు.

  • ఫొటోతో కూడిన యూఏఎన్ (UAN) కార్డ్: గతంలో UAN కార్డుపై కేవలం వివరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సభ్యుడి ఫొటోతో కూడిన సరికొత్త కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • సర్వీస్ హిస్టరీ: మీరు ఇప్పటివరకు ఎన్ని కంపెనీల్లో పనిచేశారు? ప్రస్తుతం ఏ సంస్థలో మీ పీఎఫ్ సభ్యత్వం కొనసాగుతోంది? అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
  • క్లెయిమ్ క్యాన్సిలేషన్ ఆప్షన్: పొరపాటున లేదా అత్యవసరంగా పీఎఫ్ డబ్బుల కోసం అప్లై చేసి.. ఆ తర్వాత వద్దనుకుంటే, ఆ క్లెయిమ్‌ను వెంటనే ఆన్‌లైన్‌లోనే నిలిపివేసే (Cancel) కొత్త సదుపాయాన్ని తెచ్చారు.
  • ఈజీ ట్రాకింగ్: పాత సాఫ్ట్‌వేర్ లేదా కొత్త సాఫ్ట్‌వేర్.. దేంట్లో నమోదైన క్లెయిమ్స్ అయినా సరే, వాటి స్టేటస్‌ను సులువుగా ట్రాక్ చేయవచ్చు.
  • స్కీమ్ సర్టిఫికెట్ సరెండర్: గతంలో పనిచేసిన కంపెనీల నుంచి పొందిన స్కీమ్ సర్టిఫికెట్‌ను ఇకపై ఆన్‌లైట్లోనే సరెండర్ చేసే వీలుంటుంది.

పాస్‌బుక్ చూడాలంటే మరికొంత కాలం వెయిటింగ్..

కోర్ సర్వీసులు, ప్రొఫైల్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు స్టార్ట్ అయినప్పటికీ.. పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకునే 'పాస్‌బుక్ పోర్టల్' మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ పనులు ఇంకా నడుస్తున్నాయని, తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం ఉంటుందని ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నోటీసు బోర్డు పెట్టింది.

Advertisement

మరోవైపు, ఆరు దశాబ్దాల నాటి పాత 'ఈపీఎఫ్ స్కీమ్ 1952' స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'ఈపీఎఫ్ స్కీమ్ 2026' నిబంధనలకు అనుగుణంగానే ఈ సరికొత్త పోర్టల్‌ను డిజైన్ చేశారు. ఈ కొత్త రూల్స్ వల్ల డిజిటల్ పారదర్శకత పెరుగుతుందని, అయితే ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించాల్సిన 12 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

English Summary

EPFO has restored some online services after system migration, introducing a photo-UAN and service history, but claim settlements face significant delays, and the passbook portal remains down.