భారత్‌తో పెట్టుకుంటే దబిడిదిబిడే: ట్రంప్ సర్కార్‌కు సొంత కంపెనీలు స్ట్రాంగ్ వార్నింగ్!

అమెరికా ప్రభుత్వం భారత్‌తో సహా పలు దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు పన్నులు విధించే యోచనపై స్వదేశీ దిగ్గజ కార్పొరేట్ కంపెనీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ సహా 60 దేశాలపై గరిష్టంగా 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఇంటెల్, డెల్, ఫోర్డ్, ఐబీఎం వంటి ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ దిగ్గజాలు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)ను హెచ్చరించాయి. దీని వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపార వర్గాలపైనే భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

Advertisement

బలవంతపు శ్రమ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను నిలువరించడంలో ఆయా దేశాలు విఫలమయ్యారనే కారణంతో అమెరికా ఈ పన్నులు విధించాలని ప్రతిపాదించింది. అయితే ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తుందని ప్రముఖ కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత పన్నుల విధానంపై పునరాలోచించాలని భారత ప్రభుత్వం కూడా అమెరికాను కోరింది.

Advertisement

అమెరికా ఉత్పత్తి వ్యయం పెరిగే ప్రమాదం

ఈ సుంకాల వల్ల అమెరికాలోనే వస్తువుల తయారీ వ్యయం గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ చిప్స్ తయారీ సంస్థ ఇంటెల్ స్పష్టం చేసింది. ఇది స్వదేశీ తయారీని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యానికే పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. మరోవైపు డెల్ టెక్నాలజీస్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు పెరగడమే కాకుండా కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరాలో తీవ్ర ఆలస్యం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐబీఎం, డోవ్ కెమికల్స్ వంటి విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి.

Advertisement

హనీవెల్ ఏరోస్పేస్, డీ బీర్స్ వంటి ప్రముఖ సంస్థలు తాము కీలక ఖనిజాలు, ల్యాప్టాప్ చిప్స్, సహజ వజ్రాల దిగుమతులపై ఎంతగానో ఆధారపడి ఉన్నామని గుర్తు చేశాయి. ఈ రంగాలపై అదనపు సుంకాలు విధిస్తే అమెరికా వినియోగదారులు, అంతర్గత రిటైలర్లకే నష్టం జరుగుతుందని నివేదిక సమర్పించాయి. ఆటోమొబైల్ తయారీ రంగంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న నాలుగు విభాగాలకు సంబంధించి అదనపు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫోర్డ్ మోటార్స్ గట్టిగా కోరింది.

నిరాధారమైన ఆరోపణలన్న భారత్

దిగుమతులపై 12.5 శాతం అదనపు పన్ను విధించాలనే ఈ ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. 60 దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎటువంటి నిర్దిష్ట క్షేత్రస్థాయి విశ్లేషణ లేకుండా యూఎస్‌టీఆర్ ఏకపక్షంగా దర్యాప్తు జరిపిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. బలవంతపు శ్రమ వల్ల అమెరికా స్వదేశీ పరిశ్రమలకు నష్టం జరుగుతోందనడానికి తగిన ఆధారాలు లేవని, భారత్ నుంచి జరిగే ఎగుమతులకు ఈ ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Advertisement

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రధాన ఉత్పత్తులకు, యూఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి పొంతన లేదని భారత్ వాదించింది. ఈ విషయమై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌తో దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఏకపక్షంగా అదనపు పన్నులు విధించడం కంటే చర్చలే ఇరు దేశాల వాణిజ్య బంధాలకు మేలు చేస్తాయని భారత్ స్పష్టం చేసింది.

ప్రస్తుత గ్లోబల్ సరఫరా వ్యవస్థలో అమెరికా కంపెనీలు ఇతర దేశాల నుంచి వచ్చే ముడిసరుకులపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ఈ తరుణంలో పన్నుల మోత మోగిస్తే వాణిజ్య ఘర్షణలు పెరగడంతో పాటు వ్యాపార నిర్వహణ వ్యయాలు అమెరికాలోనే భారంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

English Summary

The US government plans to impose a 12.5% tariff on imports from 60 countries, including India, citing forced labor concerns. Major corporations like Intel, Dell, and Ford are warning that this will increase costs and hurt US consumers. India has also urged the US to reconsider, calling the allegations unsubstantiated.