ఎంత కాలం, ఇకా చాలు.. ఆపండి: భారత్, పాకిస్తాన్ నుంచి ప్రధానులకు భారీగా

భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతూ వస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం, చొరబాట్లు మొదలుకుని అనేక అంశాలపై రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులన్నీ కూడా ఎప్పుడూ హైఅలర్ట్ లోనే ఉంటాయి. డేగ కళ్లతో పహారా కాస్తుంటారు భద్రత బలగాలు. దౌత్యపరంగానే కాకుండా క్రీడల్లోనూ ఇదే తరహా వాతావరణం ఎప్పటి నుంచో ఉంటోంది. ఇప్పటికీ భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు.

Advertisement

ఈ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతూ భారత్, పాకిస్తాన్ నుంచి తాజాగా వినతులు వెల్లువెత్తాయి. వేర్వేరు రంగాలకు చెందిన 117 మంది ప్రముఖులు సంయుక్తంగా ఓ లేఖ రాశారు. ప్రధానులు మోదీ, షెహబాజ్ షరీఫ్‌లకు విడివిడిగా ఈ లేఖను పంపించారు. సుదీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను వీడి, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సంస్థ చైర్మన్ ఓపీ షా చొరవతో ఈ వినూత్న ప్రయత్నం తెర మీదికి వచ్చింది. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో భారత్‌కు చెందిన 61 మంది, పాకిస్తాన్‌కు చెందిన 56 మంది నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, భారత నిఘా సంస్థ 'రా' మాజీ చీఫ్ ఏఎస్ దులాత్ ఉన్నారు.

Advertisement

వీరితో పాటు విద్యావేత్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఇందులో భాగస్వామ్యులు అయ్యారు. పాకిస్తాన్ తరఫున కూడా కీలక స్థాయి వ్యక్తులు ఈ లేఖపై సంతకాలు చేశారు. వారిలో ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరి, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ జహంగీర్ కాజీతో పాటు ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త పర్వేజ్ హూద్‌భాయ్ ఉన్నారు. 2004-2007 మధ్య కుదిరిన ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు ప్రజలు భారత్, పాకిస్తాన్‌లలోనే జీవిస్తున్నారని, ఇరు దేశాలలోని అధిక జనాభా యువత కావడం వల్ల వారి ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రభావితమవుతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖ ద్వారా భారత్, పాక్ ప్రభుత్వాల ముందు పలు కీలక విజ్ఞప్తులను ఉంచారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో హైకమిషనర్లను మళ్లీ నియమించడం ద్వారా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు.

Advertisement

సాధారణ పౌరుల కోసం వీసా సేవలను పునఃప్రారంభించాలని, సరిహద్దుల గుండా సాంస్కృతిక, మతపరమైన పర్యటనలను సులభతరం చేయాలని కోరారు. అదే సమయంలో కాశ్మీరీ పండిట్ల పవిత్ర క్షేత్రమైన శారదా పీఠాన్ని భక్తుల దర్శనం కోసం తెరవాలని విజ్ఞప్తి చేశారు. మీడియాపై ఉన్న ఆంక్షలను కూడా ప్రస్తావించారు. సమాచార మార్పిడి సరైన పద్ధతిలో జరగడానికి మీడియాపై ఉన్న పరిమితులను తొలగించాలని సూచించారు.

జర్నలిస్టులు ఇరు దేశాలలో స్వేచ్ఛగా పర్యటించి రిపోర్టింగ్ చేసుకునేందుకు వీలు కల్పించాలని అన్నారు. సరిహద్దుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడటానికి పౌర సమాజం మధ్య పరస్పర అవగాహన ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ ఉమ్మడి ప్రకటన ఏ రాజకీయ పార్టీకో లేదా ఒక నిర్దిష్ట సిద్ధాంతానికో మద్దతు ఇచ్చేది కాదని, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, భద్రతలు నెలకొల్పడం, దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

English Summary

117 India-Pakistan Citizens Urge PMs Modi and Shehbaz Sharif to Restore Diplomatic Ties, Reopen Borders. It also called for the reopening of a comprehensive bilateral dialogue on all outstanding issues, including Jammu and Kashmir, and suggested revisiting the framework.