22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..

వ్యవస్థ చేసిన ఒక చిన్న పొరపాటు, పోలీసుల తొందరపాటు ఓ అమాయకుడి జీవితాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నాశనం చేసింది. పాతిక ఏళ్ల వయసులో జైలుకెళ్లిన ఒక వ్యక్తి, ఏ తప్పు చేయకపోయినా కడిగిన ముత్యంలా బయటకు రావడానికి ఏకంగా 22 సంవత్సరాల సమయం పట్టింది.

ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో 2004లో ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురైన ఉదంతంలో అర్జున్ జానీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం అనుమానంతోనే అతనిని నిందితుడిగా భావించి కటకటాల వెనక్కి నెట్టారు. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

మూడో కంటికి తెలియని హింస.. ఒకే ఒక్క సాక్షి డ్రామా!

ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్కే సింగ్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పోలీసుల విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, థర్డ్ డిగ్రి ఉపయోగించి.. నేరాన్ని బలవంతంగా ఒప్పించడం, దాని ఆధారంగా శిక్ష పడేలా చేయడం న్యాయ సూత్రాలకే విరుద్ధమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ హత్య కేసులో ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షి సాక్ష్యాన్ని పోలీసులు కీలకంగా మార్చారు. అయితే, ఆ సాక్షి చెప్పిన విషయాలు, వేర్వేరు సమయాల్లో ఇచ్చిన ప్రకటనల్లో ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయని, అతని మాటలు అస్సలు నమ్మశక్యంగా లేవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Supreme Court: లిఫ్ట్ ప్రమాదాలపై సంచలన తీర్పు, ఇక నుంచి రూల్స్ ఇలాగే ఉండాలి

హైకోర్టు అలసత్వం.. దశాబ్దాల కాలయాపన!

మరోవైపు ఈ కేసులో న్యాయవ్యవస్థ స్థాయిలో జరిగిన ఆలస్యం కూడా ఓ అమాయకుడికి శాపంగా మారింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై జానీ హైకోర్టును ఆశ్రయించగా, దరఖాస్తు దాఖలు చేయడంలో 3,157 రోజుల ఆలస్యం జరిగిందనే సాంకేతిక కారణంతో విచారణ చేపట్టకుండానే పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పటికే అతడు 12 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు.

ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంలోనూ తీవ్ర ఆలస్యం జరిగినప్పటికీ, జైలు నుంచి దాఖలైన అప్పీల్ కావడం, నిందితుడు ఏళ్ల తరబడి మగ్గుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. మారణాయుధమైన రాయి సేకరణ, పోలీసు విచారణాధికారి స్టేట్‌మెంట్ల మధ్య పొంతన లేకపోవడాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుపట్టారు.

Vande Mataram: అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష. జాతీయ గేయానికి చట్టబద్ధమైన పవర్స్!

22 ఏళ్ల ఆయుష్షును ఎవరు తిరిగిస్తారు?

"ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేకుండా ఒక మనిషి జీవితంలో విలువైన 22 సంవత్సరాలను కారడవి లాంటి జైలు గోడల మధ్యే తుడిచిపెట్టేశారు" అని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ నిందలను నిరూపించడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేస్తూ అర్జున్ జానీని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఇన్నాళ్లూ సమాజానికి దూరమైన అతనికి పునరావాసం కల్పించి, తిరిగి సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలని కొరాపుట్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

English Summary

The Supreme Court acquits an Odisha man after 22 years in prison over a 2004 murder case, slamming police torture and weak, unreliable evidence.