సిమ్లా ఒప్పందానికి 54 ఏళ్లు: పాక్‌ను క్షమించి వదిలేసిన భారత్!

భారత చరిత్రలో మైలురాయిగా నిలిచిన సిమ్లా ఒప్పందం జరిగి 2026 జులై 2 నాటికి సరిగ్గా 54 ఏళ్లు పూర్తయ్యాయి. 1971లో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన భీకర యుద్ధం ముగిసిన ఏడాది తర్వాత 1972 జులై 2న ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ.. పాకిస్థాన్ తరఫున జుల్ఫికర్ అలీ భుట్టో ఈ చర్చలలో పాల్గొన సంతకాలు చేశారు. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఘోరంగా ఓడించడంతో అప్పటివరకు తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న భూభాగం విముక్తి పొంది బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ప్రపంచ పటంపై ఆవిర్భవించింది.

Advertisement

1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన భారత సైన్యం ఏకంగా 93 వేల మంది పాక్ సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించింది. అంతే కాకుండా వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 15 వేల చదరపు కిలోమీటర్ల భూభూగాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతిని నెలకొల్పడానికి సిమ్లా వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.

Advertisement

ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పెద్ద మనసుతో పాకిస్థాన్‌కు చెందిన 93 వేల మంది యుద్ధ ఖైదీలను సురక్షితంగా తిరిగి అప్పగించింది. అలాగే తాను స్వాధీనం చేసుకున్న 15 వేల చదరపు కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని కూడా తిరిగి ఇచ్చేసింది. దీనికి ప్రతిగా ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని వివాదాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని.. ఇందులో మధ్యవర్తిత్వానికి జోక్యం లేదని పాకిస్థాన్ అంగీకరించింది.

సిమ్లా ఒప్పందం ద్వారానే 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను 'నియంత్రణ రేఖ'గా గుర్తించారు. ఒకరి సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను మరొకరు గౌరవించుకోవాలని.. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఇరు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. పరస్పర సహకారం, స్నేహపూర్వక సంబంధాలతో ముందుకెళ్లాలని నాడు సంకల్పించినప్పటికీ.. ఆ తర్వాత కాలంలో పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తూనే వస్తోంది.

English Summary

Marking 54 years of the historic Shimla Agreement signed between India and Pakistan in 1972, following the 1971 war and the liberation of Bangladesh.