నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానం, జాతీయ భద్రత అంశంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. 2014 నుంచి దేశ భద్రత, భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం వెనుక అజిత్ దోబాల్ ఉన్నారని తెలిపారు. ఈ మేరకు శనివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేతుల మీదుగా దోబాల్ ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ అవార్డును అందుకున్నారు. అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దోబాల్ సేవలను గుర్తు చేశారు.
జాతీయ భద్రతను మరింత దృఢంగా మార్చే విషయంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ వ్యూహాత్మక సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి.. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన తన సహకారం అందించారని అమిత్ షా కొనియాడారు. ఆయన కృషికి గానూ భారత చరిత్రలో ఒక గోల్డెన్ పేజీ అజిత్ దోబాల్ కు ఉంటుందని ప్రశంసించారు. " భారత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో అజిత్ దోబాల్ కృషి మరువలేనిది. ఎప్పుడైనా చరిత్రను లిఖిస్తే.. అంతర్గత భద్రత, బహిర్గత భద్రత గురించి మాట్లాడితే అజిత్ దోబాల్ కు గోల్డెన్ పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు" అని అమిత్ షా స్పష్టం చేశారు.
2014 లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఒకటి అజిత్ దోబాల్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం అని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత విదేశాంగ విధానం అత్యుత్తమ స్థాయిలో ఉంది. మనం మన స్థానాన్ని ప్రపంచంలో సుస్థిరంగా ఏర్పాటు చేసుకున్నాం.. అని అమిత్ షా పేర్కొన్నారు. 2014 లో అజిత్ దోబాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆధునిక హంగులు దిద్దడంలో.. టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది.. అని తెలిపారు.
అజిత్ దోబాల్ కృషిని ఎప్పుడూ ప్రజల ముందు పెట్టలేదు.. అందుకు ఇంటెలిజెన్స్, భద్రతా పరమైన కారణాలు ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. తాను గుజరాత్ హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఘటన సమయంలో అజిత్ దోబాల్ తో చర్చించిన అంశాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ పోలీసులకు ఒక్కటే సూచన చేశారని.. అజిత్ దోబాల్ చెప్పినట్లు చేయాలని తెలిపినట్లు అమిత్ షా గుర్తుచేసుకున్నారు.
" అజిత్ దోబాల్ మా ఇంటికి వచ్చిన సంగతి నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలతో గుజరాత్ పోలీసులు కేవలం అహ్మదాబాద్ బాంబ్ దాడులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా 13 బాంబ్ బ్లాస్ట్ ఘటనలను ఛేదించారు. ఇది అతి పెద్ద విజయం" అని అమిత్ షా స్పష్టం చేశారు.