కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం ఉదయం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు సౌత్ తాలూకా పరిధిలోని మదపట్న ప్రాంతంలో ఉన్న ఓ రాతి క్వారీలో పనులు జరుగుతుండగా.. అకస్మాత్తుగా భారీ కొండ చరియ విరిగిపడంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం దాదాపు 18 మంది కార్మికులు రోజువారీ పనుల్లో భాగంగా క్వారీలో పాళ్లు పగలగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి ఓ భారీ బండరాయి ఒక్కసారిగా విరిగి కార్మికులపై పడింది. ప్రమాదం చాలా వేగంగా జరగడంతో కార్మికులు తప్పుకునేందుకు కూడా సమయం దొరకలేదు. భారీ శిథిలాల కింద నలిగిపోవడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలను తొలగించి, చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన కార్మికులు బతుకుదెరువు కోసం బీహార్, అసోం రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వలస వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల పూర్తి వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రమాదంతో క్వారీల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.