ఇంట్లో బంగారం ఉందా, ఇలా చేస్తే భారీ లాభం- కేంద్రం కొత్త పథకం..!!

బంగారం పై కేంద్రం కీలక నిర్ణయం అమలుకు సిద్దమైంది. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్పు చేస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలతో స్కీంను ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంలోనే మార్పులు చేసి.. వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగించటమే లక్ష్యంగా అమల్లోకి తేనుంది. దీని ద్వారా నిల్వ ఉన్న బంగారం వినియోగంతో పాటుగా.. దిగుమతుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

Advertisement

పసిడి మార్కెట్ లో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేంద్రం అప్రమత్తం అయింది. ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోళ్లు చేయవద్దని ప్రధాని మోదీ సూచించారు. క్రమేణా ఆ ప్రభావం బులియన్ మార్కెట్ పైన పడింది. కొనుగోళ్లు తగ్గాయి. బంగారం ధరలు క్రమేణా తగ్గు ముఖం పట్టాయి. ఇదే సమయంలో కేంద్రం గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్రం తీసుకురానున్న ఈ పథకం ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారం ఏ రూపంలో ఉన్న బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసే అవకాశం కల్పిస్తారు. కనీసం పది గ్రాములు డిపాజిట్ చేసే విధంగా మార్గదర్శకాలు సిద్దం అవుతున్నాయి. డిపాజిట్ చేసిన బంగార్ని కరిగించి 99.5 శాతం క్వాలిటీతో బిస్కెట్ రూపం లోకి తీసుకురానున్నారు. ఈ పథకంలో మూడు రకాల కాలపరిమితులు ప్రవేశ పెట్టనున్నారు.

Advertisement

వచ్చే నెలలో ప్రకటన దిశగా కసరత్తు

కాగా, ఎంపిక చేసుకున్న కాలపరిమితికి అనుగుణంగా వడ్డీ చెల్లించనున్నారు. అదే విధంగా వడ్డీని ఖరారు చేసే అధికారం బ్యాంకులకే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ సమయంలో ఎంపిక చేసుకున్న కాలపరిమితి ముగిసిన తరువాత వినియోగదారులు తాము డిపాజిట్ చేసిన బంగారాన్ని..కావాలనుకుంటే ఆ రోజు మార్కెట్ రేటుకు అనుగుణంగా సొమ్మును పొందే విధంగా ఈ స్కీంకు తుది రూపు ఇస్తున్నారు. 2025 మార్చిలో తీసుకొచ్చిన పథకంలో మిడిల్, లాంగ్ డిపాజిట్ ల కే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పథకానికి ఆశించినంతగా స్పందన రాలేదు. గడిచిన 11 ఏళ్లలో ఈ స్కీమ్‌ కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే సమీకరణ జరిగినట్లుగా తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దేశంలో దాదాపు 50 వేల టన్నుల వర కు బంగారం నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. దీని విలువ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.475 లక్షల కోట్లు) స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. దీంతో, బంగారం దిగుమతుల భారం తగ్గించుకునేందుకు ఈ కొత్త పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

English Summary

Central government is expected to announce a revamped gold monetisation scheme, according to sources aware of the matter