కావేరి జలాల వివాదంపై తమిళనాడులో జరిగిన ఆందోళనల వేళ డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. త్రిషను ఉద్దేశించి ఆయన అత్యంత అసభ్యకరంగా, డబుల్ మీనింగ్ పదజాలంతో మాట్లాడారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అరెస్ట్ సైతం అయ్యారు. ఈ వ్యాఖ్యలపై సినీ గాయని చిన్మయి శ్రీపాద, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లోకి మహిళలను లాగడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
రాజకీయాల్లో పురుషాధిక్యత, మహిళలపై జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొనసాగుతున్న పురుషులు తమ స్వార్థ ప్రయోజనాలు, ఎత్తుగడల కోసం ఏ మాత్రం సంబంధం లేని మహిళలను వివాదాల్లోకి లాగడం మానేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. సమస్యలపై పోరాడాల్సింది పోయి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన నేత శివాజీ కృష్ణమూర్తి గతంలో బహిరంగ వేదికలపై మహిళలను ఉద్దేశించి మాట్లాడిన అసభ్యకర వ్యాఖ్యలను కూడా చిన్మయి శ్రీపాద ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీల్లోని కొందరు పెద్దల నుంచి లభించిన ప్రోత్సాహం వల్లే ఇలాంటి ప్రసంగాలకు వారు తెగబడుతున్నారని, చివరకు చర్యలు తీసుకునే వరకు ఆ వ్యవహారం అలాగే నెట్టుకొచ్చారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆ ప్రసంగంలో ఉన్న అసలు అంతరార్ధాన్ని మొదట తాను గుర్తించలేకపోయానని, తోటివారు వివరించే వరకు తనకు కూడా అర్థం కాలేదని అన్నారు. కావేరీ నదీ జలాల విషయంలో ఉదయనిధి మాట్లాడి ఉండొచ్చని మొదట భావించానని చిన్మయి వివరించారు. దీనికి భిన్నంగా త్రిషను లాగడం సరికాదని పేర్కొన్నారు. త్రిష గురించి సభలో మాట్లాడుతున్న వారిని వారించాల్సింది పోయి, మరింత చులకనగా ప్రవర్తించడం విచారకరమని అన్నారు. గతంలో జయలలిత సైతం ఇలాంటి దూషణలను ఎదుర్కొన్నారని శ్రీపాద చిన్మయి గుర్తుచేశారు. ఈ తరానికి చెందిన యువ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఇలాంటి నీచమైన దూషణలకు దిగడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల తీరుపై మహిళలు నిశ్శబ్దంగా ఉండకుండా సంఘీభావంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయ హుందాతనాన్ని కాపాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని గౌరవించే విధంగా పార్టీలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిన్మయి సూచించారు. నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆయన మాటలు అత్యంత చౌకబారుగా, అసభ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలకు గాను తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయ ప్రసంగాలను చాలా చిన్న విషయాలుగా మార్చే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరమని, ఇది భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.త్రిష చిచ్చు: భగ్గుమంటోన్న తమిళనాడు: ఉదయనిధి అరెస్ట్ తో డీఎంకే రోడ్లపైకి: ఎక్కడికక్కడ
త్రిష పై వల్గర్ కామెంట్స్- ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్: చెన్నై ఇంటి వద్ద హైడ్రామా