తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు టీవీకే అధినేత, సీఎం జోసెఫ్ విజయ్. వెండితెరపై "దళపతి"గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నారు. ఇప్పటికే దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సైతం 2035 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సర్వత్రా ప్రశంసలు పొందుతున్నారు.
కాగా విజయ్ కరూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయితే ఈ దుర్ఘటన జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్న తరుణంలో విజయ్ కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు.
ఈ మేరకు కరూర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. బాధిత కుటుంబాల్లోని అర్హులైన 32 మందికి వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను కేటాయించారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో నియామకాలు జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం. అలానే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల పరిహారం అందజేయగా.. టీవీకే పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో భర్తను కోల్పోయిన నివేదిక అనే మహిళకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం లభించింది. ఈ నియామకం తమ కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరో బాధితురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ.. తమ గోడు విని సీఎం కంటతడి పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలో ఒక మాయని గాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమైన అనుభవమని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆనాటి ర్యాలీలో పోలీసుల భద్రతా ఏర్పాట్లను నమ్మానని.. అయితే ప్రజల నియంత్రణలో వైఫల్యాలు ఎందుకు చోటుచేసుకున్నాయని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మృతుల జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.