ఏపీ వైపు..ఉరకలెత్తుతూ: శృంగేరి వద్ద తుంగా తాండవం- రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఉత్తర, కోస్తా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిక్కమగళూరు, శృంగేరి, తీర్థహళ్లి పరిసరాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు పడుతున్నాయి. ఫలితంగా తుంగ నది ఉగ్రరూపం దాల్చింది. ఉరకలెత్తుతోంది. ఈ భారీ వరదల కారణంగా శివమొగ్గ జిల్లా గాజనూరు వద్దనున్న తుంగ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. ప్రస్తుత సీజన్‌లోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది.

Advertisement

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో కర్ణాటకవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జలాశయాల కంటే ముందే పూర్తి స్థాయిలో నిండిన మొదటి ప్రాజెక్టు ఇదే. శివమొగ్గ జిల్లా పరిధిలో వర్షాలు ఊపందుకోవడంతో స్థానిక నదులు, చెరువులు సరికొత్త జలకళను సంతరించుకున్నాయి. కొండకోనల నుంచి ప్రవహించే జలపాతాలు, వాగులు వంకలు ఉరకలేస్తూ దిగువకు ప్రవహిస్తుండటంతో నదిలోకి వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో తుంగ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదలివేస్తోన్నారు.

Advertisement

తుంగ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 588.24 మీటర్లు. వరదనీటి వల్ల ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 588.14 మీటర్లకు చేరుకుంది. అదనంగా 3.24 టీఎంసీల పూర్తి స్థాయి నీటి అందుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుని నీటి పారుదల శాఖ అధికారులు దిగువకు ప్రవాహాన్ని వదులుతున్నారు. జలాశయంలోకి 20,565 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18,051 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఈ వరద ఉధృతి నేపథ్యంలో డ్యామ్‌ మొత్తం 10 క్రస్ట్ గేట్లతో పాటు మరో 2 స్లూయిస్ గేట్లను కూడా అధికారులు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. శృంగేరి, తీర్థహళ్లి పరిసరాల్లో భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ప్రవాహం మరికొంత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తుంగ నది క్రమంగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శివమొగ్గ జిల్లా యంత్రాంగం, నీటి వనరుల శాఖ సంయుక్తంగా అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

నదీ పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత నివాసితులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. స్థానికులు, పర్యాటకులు నదీ తీరాల్లోకి వెళ్లవద్దని, రక్షణ గ్రిల్స్ దాటి నదిలోకి దిగేలా ఎటువంటి సాహసాలూ చేయవద్దని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గేట్లు ఎత్తివేయడంతో వరద నీటి అందాలను చూసేందుకు పర్యాటకులు రద్దీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో స్థానిక పోలీసు విభాగం, రెవెన్యూ సిబ్బంది నది ఒడ్డున ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.

English Summary

Crest Gates of Tunga Reservoir in Karnataka Lifted to Release Excess Monsoon Inflows to Downstream. Heavy inflow caused by rain in the catchment area prompted officers of the Tunga Project to open the gates. The water level stood at 588.18 m, against the full reservoir level.