ఢిల్లీ సర్కారు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'మహిళా సమృద్ది యోజన' అమలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ(ఆగస్టు 28) కానుకగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకం కింద ప్రతి నెల రూ.2,500 లబ్ధి చేకూరనుంది. ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయబడుతుంది.
ఈ పథకానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అర్హత వివరాలను కూడా తెలిపింది. దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారు కనీసం గత ఐదేళ్లుగా ఢిల్లీలో శాశ్వత నివాసితులుగా ఉండడంతో పాటు వారి కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు ఉండాలి. ఈ పథకం కింద ఓ కుటుంబం నుంచి కేవలం ఒక్క మహిళకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డ్ కలిగిన మహిళలకు ఈ ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీని ద్వారా సుమారు 20 నుంచి 22 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని తెలుస్తోంది.
అయితే అందరు మహిళలకు ఈ పథకం వర్తించదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు.. సొంతంగా 4 చక్రాల వాహనం(కారు) కలిగిన వారు ఈ పథకానికి అర్హులు కారు. వీరితో పాటు ఆదాయపు పన్ను చెల్లించే మహిళలు లేదా ఇప్పటికే ఇతర ప్రభుత్వ పెన్షన్లు, ఆర్థిక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి కూడా ఈ రూ.2500 సహాయం అందదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్కీమ్‌కు అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్‌లైన్ పోర్టల్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. అర్హులైన మహిళలు అప్లికేషన్ సమర్పించేటప్పుడు తమ నివాస ధ్రువీకరణ పత్రం(ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డ్), ఆధార్ కార్డ్, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్, ఇన్‌కమ్ సర్టిఫికేట్(ఆదాయ ధ్రువీకరణ పత్రం), ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి మహిళలకు చేదోడువాదోడుగా ఉంటూ వారి సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.