కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఛార్జ్‌షీట్, పిటీషన్ ను రోజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల బ్రిజ్ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని స్వాగతిస్తోన్నానని అన్నారు.
2023 నాటి కేసు ఇది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయనపై ఈ ఛార్జ్‌షీట్ నమోదయింది. పలు సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి.
ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగించారు. వారి నిరసనలు, ఆందోళనలకు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి అప్పట్లో. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలంటూ సచిన్ టెండుల్కర్, 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టు సభ్యులు, పలువురు క్రీడారంగ ప్రముఖులు గళమెత్తారు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్‌ను నమోదు చేశారు. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో దాన్ని దాఖలు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 354, 354 ఏ, 354డీ కింద ఛార్జిషీట్‌ను రూపొందించారు. భారత రెజర్ల సమాఖ్య మాజీ అసిస్టెంట్ కార్యదర్శి వినోద్ తోమర్ పేరును కూడా ఇందులో జత చేశారు. ఆయనపై ఐపీసీలోని 109, 354, 354 ఏ, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ ఈ కేసును వాదించారు. తాజాగా ఢిల్లీ కోర్టు వారిద్దరిపైనా నమోదైన కేసులన్నింటినీ కొట్టివేసింది. ఈ మేరకు రోజ్ అవెన్యూ కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జస్టిస్ అశ్విని పన్వార్ తుది తీర్పును వెలువరించారు. ఆరుమంది బాధిత మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై సుదీర్ఘ విచారణ, ఇరుపక్షాల తుది వాదనలు విన్న న్యాయస్థానం ఇదివరకే తన తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. మహిళా రెజ్లర్ల ఆరోపణల్లో తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. తీర్పు వెలువడిన అనంతరం బ్రిజ్ భూషణ్ మాట్లాడారు. తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసి ఉంటే ఉరివేసుకుంటానని అప్పట్లోనే చెప్పానని, న్యాయం గెలిచిందని అన్నారు. దీనిపై ఎలా ముందుకెళ్తారంటూ విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దీన్ని మరిచిపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుతో తాను నిర్దోషిననే విషయం నిరూపితమైందని, తనపై ఆరోపణలు చేసిన వాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.ఉజ్జయినీ మహాకాళి క్రోధాగ్ని- రంగంలో కోపంతో ఊగిపోతూ భవిష్యవాణి వినిపించిన మాతంగి
లాభాల బాట పట్టిన బంగారం ధరలు- బిగ్ బెట్