సర్జికల్ స్ట్రయిక్స్ దాడుల కోసం చిరుతపులి యూరిన్ సాయం: ఎలాగంటే?


న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించి, పదుల సంఖ్యలో టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో చిరుతపులి యూరిన్‌ను కూడా ఆర్మీ ఉపయోగించుకుందట.

అందుకే చిరుతపులి మలమూత్రాలు

తమ రాకను గమనించి శునకాలు అరవకుండా ఉండేందుకు చిరుతపులి మలమూత్రాలను ఆర్మీ వెంట తీసుకు వెళ్లింది. ఈ విషయాన్ని మాజీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేంద్ర నింబోర్కర్‌ తెలిపారు.

సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఆసక్తికర విషయాలు

నౌషెరా సెక్టార్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌గా రాజేంద్ర పని చేశారు. 2016లో సైన్యం చేపట్టిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో పాల్గొన్నారు. ఆయన సేవలకు గాను పుణెలోని ఓ సంస్థ మంగళవారం సన్మానించింది. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడారు. దాడులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నౌషెరా సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో చిరుతపులులు పగలు తరచూ శునకాలపై దాడులకు పాల్పడుతుంటాయని, దాంతో పగలు దాక్కొని ఉండే శునకాలు రాత్రి సమయంలో బయటకు వస్తుంటాయన్నారు.

చిరుతపులి మలమూత్రాలు చల్లడంతో రాని శునకాలు

సర్జికల్ స్ట్రయిక్స్ సమయంలో తాము శునకాలు ఉండే గ్రామాలను దాటుకుంటూ వెళ్లవలసి వచ్చిందని, మన ఆర్మీ రాక గమనించి అవి అరవడం, దాడి చేసే అవకాశాలు ఉంటాయని భావించి, తాము చిరుతపులి మలమూత్రాలను తీసుకెళ్లి ఆయా గ్రామాల్లో చల్లామని తెలిపారు. తమ ప్రయత్నం విజయవంతమైందన్నారు. చిరుత మలమూత్రాల వాసనను పసిగట్టిన శునకాలు బయటికొచ్చే ధైర్యం చేయలేదన్నారు.

వేకువజామున సర్జికల్ స్ట్రయిక్స్ బాగుంటుందని

ఈ దాడులను సైన్యం రహస్యంగా, పకడ్బంధీగా చేపట్టిందని తెలిపారు. నాటి రక్షణ మంత్రి పారికర్‌ ఈ దాడుల గురించి తమకు చెప్పారని, వారంలో పూర్తి చేయాలని సూచించారని, ఎక్కడ దాడులు చేయాలి, ఎలా చేయాలనే విషయమై ప్లాన్ ప్రకారం ముందుకు సాగామని చెప్పారు. వేకువజామున సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చామన్నారు.

Have a great day!
Read more...

English Summary

The Indian soldiers who carried out surgical strikes across the Line of Control (LoC) in September, 2016 used an unusual weapon apart from firepower: leopard urine and feces.