కుండపోత వర్షం- రెడ్ అలర్ట్, బయటకు రావద్దు..!!

ముంబాయి నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలోనూ భారీ వర్షం కురవడంతో నీటి నిల్వలు మరింత పెరిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ముంబాయితో పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల వేళ ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

Advertisement

ముంబాయి నగరం మరోసారి భారీ వర్షాలతో నీట మునిగింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ విజ్ఞప్తి చేసింది. వారం రోజులుగా ముంబాయి నగరార్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబాయి తో పాటుగా థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఈ నెల 6వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటుగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసారు.

Advertisement

మరో వారం భారీ వర్షాలు

ప్రభుత్వం భారీ వర్షాల పైన ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రవాణా సేవల పైన భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినా.. ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ కనిపించారు. నగరంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో బృహన్ ముంబయి కార్పొరేషన్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముంబాయిలో ఎప్పటికప్పుడు వరద నీరు బయటకు పంపే విధంగా డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, అత్యవసర సేవల సిబ్బందిని క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచారు. బీఎంసీ అధికారులు నిరంతరం లోతట్టు ప్రాంతాల పైన ప్రభావం గమనిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. పుణె జిల్లాలోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

English Summary

IMD issued a red alert for Mumbai and Raigad district, valid for the next three hours due to heavy rainfall since Saturday