దక్షిణాన వర్షాలు దంచికొడుతుంటే.. నార్త్ ఇండియాలో మాత్రం ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి! ఈ ఏటి నైరుతి రుతుపవనాలు దేశాన్ని రెండు ముక్కలు చేశాయా? అన్నట్లుగా చిత్రమైన వాతావరణం నెలకొంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలోని ఒకవైపు దట్టమైన మేఘాలు పరుచుకుని కుండపోత వర్షాలు కురిపిస్తుంటే.. మరొకవైపు మాత్రం పొడి వాతావరణంతో వర్షాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ రకమైన అసమాన గమనం వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పడాల్సిన సాధారణ వర్షపాతంలో ఏకంగా 11 శాతం లోటు నమోదైంది.
శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ విచిత్ర వాతావరణం!
భారత అంతరిక్ష ఉపగ్రహం 'ఇన్సాట్-3డీఎస్' (INSAT-3DS) తీసిన చిత్రాల్లో రుతుపవనాల విచిత్ర రూపాంతరం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల్లో దట్టమైన నల్లటి మేఘాలు అలుముకుని ఉండగా, వాయువ్య భారత్, గంగా మైదాన ప్రాంతాల్లో మేఘాలు చెల్లాచెదురుగా చిన్న చిన్న తునకల్లా పరుచుకున్నాయి. జూన్ నెలతో పోలిస్తే వర్షభావ పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ, దేశవ్యాప్తంగా జూన్ 4 నుంచి పడాల్సిన 446.3 మిమీ వర్షపాతానికి గాను ఇప్పటివరకు కేవలం 395.5 మిమీ మాత్రమే నమోదైంది. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముంచెత్తుతుంటే.. ఉత్తరాదిలోని హందీ బెల్ట్ రాష్ట్రాల్లో మాత్రం అసంతృప్తి వాతావరణం నెలకొంది.
ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మరియు ఉక్కపోత వేధిస్తుండగా, గుజరాత్ మరియు దక్షిణ రాజస్థాన్‌లో మాత్రం ఎడతెరిపి లేని వానలతో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే దేశంలో ఒకచోట ప్రళయం లాంటి వర్షాలు, మరోచోట ఆకాశంలో మబ్బుల కరువు కనిపించడం ఈ ఏడాది రుతుపవనాల విలక్షణ తీరుకు అద్దం పడుతోంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న రుతుపవనాల ద్రోణి తిరిగి ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పుంజుకోనున్నాయి. ప్రారంభంలో అక్కడక్కడే చిన్నపాటి జల్లులు కురిసినప్పటికీ, రాబోయే ఆగస్టు 3 నుంచి 5వ తేదీల మధ్య 40 నుంచి 100 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేస్తోంది. ఈ వర్షాలతోనైనా లోటు పూడుతుందని నార్త్ ఇండియా రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. ఇక మూడు రోజులు కుండపోతే- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
కొందరికి జలదిగ్బంధం.. మరికొందరికి ఎండల సెగ!
IMD: ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్! ఆకాశానికి తూట్లు.. ఈ జిల్లాల్లో వాన
ఉత్తరాదికి మళ్లీ వాన గండం.. ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు?