భారత్ కూ హార్ముజ్ జలసంధి: డబుల్ చెక్- ప్రధాని మోదీ ఇండోనేషియా టూర్ వ్యూహం

ప్రపంచవ్యాప్తంగా వివిధ రీజియన్లల్లో సముద్ర జలాలు కల్లోలాలను రేకెత్తిస్తున్న ప్రస్తుత తరుణంలో.. హిందూ మహాసముద్రంలో తన వ్యూహాత్మక ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా భారత్ అడుగు వేసింది. ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని, ముఖ్యంగా చైనా ఆర్థిక బలాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న 'మలక్కా జలసంధి’ని అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇండోనేషియాకు చెందిన 'సబాంగ్’ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Advertisement

ఈ కీలక ఒప్పందం ప్రకారం..

ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ కీలక ఒప్పందం ప్రకారం.. మలక్కా జలసంధి సరిహద్దున ఉన్న సబాంగ్ పోర్ట్ ను ఇరు దేశాలు అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నాయి. భౌగోళికంగా ఈ రేవు భారత్ కు చివరి సరిహద్దు అండమాన్ నికోబార్ దీవుల్లోని 'ఇందిరా పాయింట్’కు 120 కిలోమీటర్ల ఉండటం దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత పెంచుతోంది.

Advertisement

హార్ముజ్ స్ట్రెయిట్..

హార్ముజ్ స్ట్రెయిట్ తరహాలో దీన్ని డెవలప్ చేయాలని రెండు దేశాలు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ మహాసముద్ర తీరంలో చైనా నౌకాదళ దూకుడుకు పగ్గాలు వేసేందుకు భారత్ సిద్ధం చేసిన వ్యూహంగా భావిస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, భవిష్యత్తులో రాబోయే భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సబాంగ్ రేవు ప్రాజెక్టు ఒక బలమైన పునాదిగా నిలవబోతోంది.

మలక్కా జలసంధి ప్రాధాన్యత

ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసించే శక్తి సముద్ర మార్గాలకు ఉంది. పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతల సమయంలో 'హార్ముజ్ జలసంధి’ మూసివేతతో ముడిచమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఎలా దూసుకెళ్లాయో తెలిసిందే. ఇప్పుడు అదే వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన మలక్కా జలసంధి గేట్ వే వద్ద భారత్ పట్టును సాధిస్తోంది. హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్లే ఈ అత్యంత ఇరుకైన జలసంధి ద్వారా ఏటా దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులు రవాణా అవుతుండటం గమనార్హం.

Advertisement

చైనాకు జీవనరేఖ..

ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 శాతం వాటా కలిగిన ఈ జలసంధి చైనా ఆర్థిక రంగానికి ఒక జీవనరేఖ వంటిది. చైనా తన పరిశ్రమలకు, రవాణా రంగానికి అవసరమైన ముడి చమురు, సహజ వాయువులలో దాదాపు 80 శాతాన్ని పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాల నుండి ఈ మార్గం గుండానే దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో శత్రు దేశాలు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని మూసివేస్తే, చైనాకు ఇంధన సరఫరా నిలిచిపోయి ఆ దేశ ఆర్థిక ప్రగతి స్థంభించిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

ఈ సముద్ర రవాణా మార్గాలపై ఆధిక్యతను సాధించడానికి చైనా తన విదేశీ విధానాలను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్, ఇండోనేషియాలు కలిసి సబాంగ్ పోర్ట్‌ను ఆధునికీకరించడం ద్వారా చైనాకు ఉన్న ఈ మలక్కా సందిగ్ధతను మరింత పెంచేలా వ్యూహాత్మక పావులు కదుపుతున్నాయి.

సబాంగ్ పోర్ట్, గ్రేట్ నికోబార్ మధ్య..

భారత్ ఈ ప్రాంతంలో తన పట్టును బిగించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. 2018 లోనే ఈ రేవు అభివృద్ధిపై భారత్, ఇండోనేషియా దేశాల మధ్య చర్చలు జరిగాయి గానీ అవి పెద్దగా ఫలించలేదు. ప్రధాని మోదీ తాజా పర్యటనతో ఇప్పుడు ఇది వేగవంతం అయింది. దీనికి సమాంతరంగా భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ కూడా ఇందులో భాగం.

Advertisement

అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ అంతర్జాతీయ ట్రాన్స్-షిప్‌మెంట్ పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఆధునిక టౌన్‌షిప్‌ను భారత్ నిర్మిస్తోంది. భారత్ తన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును, ఇటు ఇండోనేషియాలోని సబాంగ్ ఓడరేవును వ్యూహాత్మకంగా గనుక అనుసంధానించగలిగితే, మలక్కా జలసంధికి రెండు వైపులా భారత్‌కు తిరుగులేని భద్రత లభిస్తుంది.

చైనా 'స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్’కు భారత దీటైన సమాధానం

గత దశాబ్ద కాలంగా చైనా తన 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’, 'స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్’ వ్యూహం కింద భారత్‌ను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్‌టోట, మయన్మార్ లోని క్యాక్‌ప్యూ పోర్టులను తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తోంది చైనా. ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి భారత్ ఇప్పుడు సబాంగ్ పోర్ట్ వంటి సరికొత్త సహకార ప్రాజెక్టుతో ముందుకు వచ్చింది.

Advertisement

భారత్ ప్రతిపాదించిన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ’ లో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి సబాంగ్ పోర్ట్ కీలకం. తూర్పు ఆసియా దేశాలైన చైనా, జపాన్, దక్షిణ కొరియాలతో భారత్ జరిపే భారీ వాణిజ్యం ఈ మార్గం ద్వారానే సాగుతున్నందున, దీని నిరంతర భద్రత దేశ ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ముఖ్యం. భద్రతతో కూడిన స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని కోరుకునే భారత్, ఇండోనేషియా దేశాల దీర్ఘకాలిక ఆశయాలకు ఈ నవీన ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుంది.

English Summary

India and Indonesia have joined forces at the strategic Sabang port to secure the vital Malacca Strait. This project, which aligns with India's Act East policy, aims to secure vital trade routes and counter China's growing naval influence in the Indian Ocean.