వెనిజులాలో భారతీయ నావికుడు మృతి.. బాడీలో అవయవాలన్నీ మాయం..!

వెనిజులాలో విధి నిర్వహణలో మరణించిన భారతీయ నావికుడు రాకేశ్ చౌహాన్ (33) మృతదేహం దాదాపు నెల రోజుల తర్వాత స్వదేశానికి చేరుకుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌ లోని డియోరియాలో నిర్వహించిన రెండో శవపరీక్షలో ఆయన శరీరంలోని గుండె, మెదడు, కాలేయం వంటి కీలక అవయవాలన్నీ మాయమైనట్లు తేలడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణమైన ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఫెడరేషన్ ఆఫ్ సీఫారర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (FSUI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేస్తోంది.

Advertisement

ఉత్తరప్రదేశ్‌ లోని డియోరియా జిల్లాకు చెందిన రాకేశ్ చౌహాన్, నవంబర్ 2025లో మర్చంట్ నేవీలో చేరి ముంబైలో నివసిస్తున్నారు. మే నెలలో ఆయన వెనిజులాలోని ఓ ఓడలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని సదరు ప్రైవేట్ షిప్పింగ్ సంస్థ ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే, స్వదేశానికి తీసుకువచ్చిన మృతదేహంలో అవయవాలు లేకపోవడంతో కుటుంబంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

శవపరీక్ష నివేదికలో షాకింగ్ నిజాలు

డియోరియా జిల్లా కలెక్టర్ మధుసూదన్ హుల్గి ఆదేశాల మేరకు మృతదేహానికి వైద్యుల బృందం రెండోసారి శవపరీక్ష నిర్వహించింది. ఈ ప్రక్రియలో రాకేశ్ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, మెదడుతో పాటు పొట్టలోని ప్రేగులు కూడా లేవని వైద్యులు గుర్తించారు. శరీరంపై మెడ నుంచి పొత్తికడుపు వరకు దాదాపు 22 కుట్లు ఉన్నట్లు శవపరీక్ష నివేదిక వెల్లడించింది. అవయవాలేవీ లేకపోవడంతో మరణానికి గల అసలు కారణాన్ని గుర్తించడం ఫోరెన్సిక్ నిపుణులకు వీలు లేకుండా పోయింది.

ఈ ఘోరమైన ఉదంతం వెనుక అవయవాల అక్రమ రవాణా లేదా పెద్ద కుట్ర దాగి ఉండవచ్చని సీఫారర్స్ యూనియన్ ఆరోపిస్తోంది. విదేశాల్లో శవపరీక్ష నిర్వహించినప్పుడు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు దాచిపెట్టారన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మృతదేహం అప్పగింత పత్రాలపై రాకేశ్ భార్య రంజన చౌరాసియా సంతకానికి బదులుగా అంజన అని తప్పుగా సంతకం చేయడం, ఉపాధి ఒప్పందంలో పేర్కొన్న నౌక పేరుకు, ఆయన పనిచేసిన నౌకకు పొంతన లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

Advertisement

కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే ఆశతో రాకేశ్ చౌహాన్ కుటుంబ సభ్యులు లక్షలాది రూపాయలు అప్పు చేసి మరీ ఆయనను వెనిజులా పంపించారు. ప్రస్తుతం ఆయనకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. తమకు జరిగిన ఈ తీరని అన్యాయంపై వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి తగిన పరిహారం ఇప్పించాలని మృతుడి భార్య రంజన ఉన్నతాధికారులను కోరుతున్నారు.

English Summary

Rakesh Chauhan, a 33-year-old sailor from Deoria, Uttar Pradesh, passed away while working in Venezuela in November 2025. Upon the body's return, a second autopsy revealed that vital organs including the heart and brain were missing. The family alleges foul play and organ trafficking, seeking an immediate investigation into the suspicious circumstances surrounding his death.