నేటి నుంచే బుకింగ్స్ ఓపెన్: ఇండిగో విమానాల్లో నూతన ఛార్జీల విధానం: ఇకపై.. !!

దేశీయ పౌర విమానయాన సంస్థ ఇండిగో ఓ నూతన విధానానికి తెర తీసింది. లో-బడ్జెట్‌లో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రజల కోసం నూతన ఛార్జీలను అమలులోకి తీసుకొచ్చింది. హ్యాండ్ బ్యాగ్ లేదా క్యాబిన్ లగేజ్‌తో మాత్రమే ప్రయాణించే వారి కోసం "ఇండిగో లైట్" (IndiGo Lite) పేరుతో ఓ ఎకానమీ క్లాస్ ఛార్జీల కేటగిరీని ప్రవేశపెట్టింది. లగేజీ రహిత ప్రయాణికులకు విమాన టికెట్ ఛార్జీలపై మరింత రాయితీ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

Advertisement

ఈ ప్రత్యేక సదుపాయం ద్వారా లభించే విమాన టికెట్ల బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం అయ్యాయి కూడా. ప్రయాణికులు ఈ టికెట్లతో జూలై 15వ తేదీ నుండి ప్రయాణాలు సాగించవచ్చని ఇండిగో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇండిగోకు చెందిన అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, నేరుగా కాల్ సెంటర్ వంటి అధికారిక యాక్సెస్ మార్గాల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఇండిగో లైట్ ప్రయోజనాలు దక్కుతాయి. డొమెస్టిక్ తో పాటు అంతర్జాతీయ నాన్ స్టాప్ విమాన ప్రయాణాలన్నింటికీ ఈ విధానం వర్తిస్తుంది.

Advertisement

ఈ సదుపాయాన్ని వన్ వే, రౌండ్ ట్రిప్,మల్టీసిటీ బుకింగ్‌లకు కూడా సమానంగా వర్తింపజేసుకోవడం ఇండిగో లైట్ ఛార్జీల ప్రత్యేకత. పెద్దలతో పాటు పిల్లల టికెట్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. సాధారణంగా ప్రయాణికులు విమానంలో తీసుకెళ్లే లగేజీ బరువు ఆధారంగా టికెట్ ధరలు నిర్ణయిస్తారు. ఈ తాజా పద్ధతి వల్ల విమానంలో లగేజీని ఎక్కువగా తీసుకెళ్లని ప్రయాణికులు తాము ఉపయోగించే సేవలకు మాత్రమే ఛార్జీలను చెల్లించే వెసలుబాటు కలుగుతుంది.

మరోవంక.. దేశీయ విమాన ఇంధన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ట్రాఫిక్ ఫ్యూయెల్ ధరలను తగ్గించింది. లీటరుకు అయిదు రూపాయల మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ఉదయం ఉత్తర్వులు ఇచ్చాయి. దీనివల్ల నేటి నుండి దేశీయ ఎయిర్‌లైన్స్‌కు లీటరు విమాన ఇంధనం ధర రూ. 110 కి అందుబాటులోకి వచ్చింది. ఈ విమాన ఇంధన ధరల క్షీణత వల్ల ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చు తగ్గి, భవిష్యత్తులో టికెట్ల ధరలు మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Advertisement

దీనితో పాటు పెట్రోలియం ఉత్పత్తులపై కూడా ఎగుమతి సుంకాలను సవరించింది. ఫలితంగా పెట్రోల్‌పై లీటరుకు రూ. 4, డీజిల్‌పై రూ. 8.5, విమాన ఇంధనంపై రూ. 7.5 లుగా సుంకాలను తగ్గింది. ఈ క్రమంలోనే ట్యాక్స్ మినహాయింపు పరిధిని మరింత పెంచుతూ, ప్రస్తుతం ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు సరికొత్తగా మారిషస్, మాల్దీవులను కూడా మినహాయింపు పొందిన దేశాల జాబితాలో చేర్చింది.

English Summary

IndiGo Lite Fare Now Covers Domestic and International Non-Stop Routes Book From July 1 for Flights Starting July 15. The new fare will be available for bookings made through IndiGo's direct channels, including its website, mobile application and contact centre, from July 1 for travel starting July 15.