INS Mahendragiri: సముద్రపు రాక్షసుడు! శత్రువుల రాడార్లకు చిక్కని సరికొత్త యుద్ధనౌక..

భారత రక్షణ రంగ చరిత్రలో మరో సువర్ణాక్షర ఘట్టం ఆవిష్కృతమైంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ దేశాల కదలికలకు అడ్డుకట్ట వేస్తూ.. భారత నౌకాదళం తన యుద్ధ శక్తిని మరింత బలోపేతం చేసుకుంది. 'ప్రాజెక్ట్ 17A' నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్‌లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఆరో అత్యాధునిక 'స్టెల్త్ ఫ్రిగేట్' యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి (INS Mahendragiri) శనివారం భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది. విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో జరిగిన వైభవంగా జరిగిన వేడుకలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. తూర్పు కనుమలలోని ప్రసిద్ధ 'మహేంద్రగిరి' పర్వత శ్రేణుల పేరుతో ఈ నౌక.. సముద్రంలో భారత పరాక్రమానికి, తిరుగులేని శక్తికి ప్రతీకగా నిలవనుంది.

Advertisement

శత్రువుల కంటికి చిక్కని 'మహేంద్రగిరి' ప్రత్యేకతలు ఇవే:

INS మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు.. సముద్రంపై కదిలే ఒక అత్యాధునిక సైనిక కోట. దీని డిజైన్, ఆయుధ సంపత్తి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉన్నాయి:

Advertisement

రాడార్లకు చిక్కని 'స్టెల్త్' టెక్నాలజీ:

ఈ యుద్ధనౌకలో అత్యంత అధునాతన 'స్టెల్త్ సాంకేతికత'ను ఉపయోగించారు. దీనివల్ల శత్రుదేశాల రాడార్ల కంటికి ఇది అంత సులభంగా చిక్కదు (Reduced Radar Signature).

త్రివిధ దాడుల్లో అమోఘం:

గగనతలం నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి (Anti-Air), సముద్ర ఉపరితలంపై శత్రు నౌకలను మట్టుబెట్టడానికి (Anti-Surface), అలాగే సముద్ర గర్భంలో దాక్కునే జలాంతర్గాములను వేటాడటానికి (Anti-Submarine) అవసరమైన అత్యాధునిక క్షిపణులు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి.

స్వదేశీ ప్రతిభ (75% ఆత్మనిర్భర్):

ఇండియన్ నేవీకి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' (WDB) దీనికి డిజైన్ చేయగా, ముంబైకి చెందిన 'మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్' (MDL) దీనిని నిర్మించింది. ఈ నౌక తయారీలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వాడటం విశేషం. దేశంలోని వందలాది MSME సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి.

Advertisement

యుద్ధ రంగంలోనే కాకుండా సముద్ర భద్రత, శోధన-సహాయక చర్యలు (Search and Rescue), ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవ సహాయం (HADR) అందించడానికి ఈ నౌక నిరంతరం సిద్ధంగా ఉంటుంది.

భారత్ కేవలం పోరాడే శక్తి మాత్రమే కాదు.. ఆర్థిక రక్షకుడు: రాజ్ నాథ్

ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.

"ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం.. ఒక దేశానికి శక్తివంతమైన, తక్షణమే స్పందించే నౌకాదళం ఎంత అవసరమో మరోసారి నిరూపించాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మన భారత నౌకాదళం 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ద్వారా సుమారు రూ.9,000 కోట్ల విలువైన అవసరమైన వస్తువులతో వెళ్తున్న 18 వాణిజ్య నౌకలకు సురక్షితంగా రక్షణ కల్పించింది. దీనిని బట్టి భారత నౌకాదళం కేవలం యుద్ధాలు చేసేందుకే కాదు.. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడే బలమైన రక్షకుడని స్పష్టమవుతోంది." అని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ విజన్ కు ప్రకారం'మహా సాగర్' ప్రాజెక్టులో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా, 'నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్'గా అవతరించిందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సముద్రపు దొంగలు (పైరేట్స్) దాడులు చేసినా.. మన నేవీనే 'ఫస్ట్ రెస్పాండర్'గా ముందుంటోందన్నారు. కేవలం ఓడను నిర్మించడమే కాకుండా దేశంలో ఒక పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తున్నామని, భవిష్యత్తులో భారత్‌ను గ్లోబల్ షిప్‌బిల్డింగ్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

English Summary

Defence Minister Rajnath Singh commissions INS Mahendragiri, the 6th Project 17A stealth frigate, into the Indian Navy at Visakhapatnam. Learn its key features.