భారత్ లో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తుంటారు. కానీ ఎలా వెళ్లాలో తెలియక ప్రయాణాలను విరమించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారికోసం తక్కువ ధరకే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయి ఐఆర్‌సీటీసీ సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా ఒకే ట్రిప్ లో గయా, అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. గంగా గయా సంగం యాత్ర పేరుతో ఈ ప్రత్యేకమైన ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ప్యాకేజీలో భాగంగా ఉత్తరాదిన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను ఈ ట్రిప్ లో కవర్ చేయొచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన గయా, వారణాసి, ప్రయాగ్ రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం తదితర క్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు.. ఎనిమిది రోజులపాటు సాగనుంది.
ఈ టూర్ విశేషాలు చూస్తే గంగా గయా సంగం యాత్ర సెప్టెంబర్ 2 న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. విమానం హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటల 55 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అలా కోల్ కతా మీదుగా సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు గయా చేరుకుంటుంది. ఇక హోటల్ లో చెకిన్ అయిన తర్వాత అక్కడే మహా బోధి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి గయాలోనే స్టే చేస్తారు.
షిర్డీ వెళ్లే భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ - ఇక నుంచి ప్రతీ వారం..!!
ఆ తర్వాతిరోజు విష్ణు ఆలయం, మంగళగౌరి శక్తిపీఠం సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారణాసి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మూడోరోజు ఉదయం గంగా నదిలో స్నానాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి గంగా హారతి చూస్తారు. అలా మూడో రోజు రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది. వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తారు. అక్కడ ఆలోపీ దేవి ఆలయం, పవిత్ర త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది.
అక్కడి నుంచి అయోధ్య చేరుకుని బాల రాముడిని సందర్శిస్తారు. ఆ తర్వాత పురాతన పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యాన్ని సందర్శిస్తారు. అలా లక్నో నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. టికెట్ ధరలకోసం అధికారిక ఐఆర్సీటీసీ యాప్ ను సంప్రదించాలి. సెప్టెంబర్ 2 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది.