Isobutanol: ఆల్కహాల్‌తో బండ్లు నడుస్తాయ్.. మైలేజ్ కూడా అదరహో!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల జీవ ఇంధనాల (బయో ఫ్యూయల్స్) వాడకం బాగా పెరుగుతోంది. మన దేశంలో కూడా ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇంధన రంగ నిపుణుల దృష్టిని 'ఐసోబ్యూటనాల్’ (Isobutanol) అనే సరికొత్త, అత్యంత శక్తివంతమైన బయో ఫ్యూయల్ ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఇది రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేయబోతోందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే దీని భౌతిక లక్షణాలు దాదాపు మనం వాడే పెట్రోలియం ఇంధనాన్ని పోలి ఉండటమే దీనికి ప్రధాన కారణం.

Advertisement

ఇథనాల్ కంటే ఎందుకు పవర్‌ఫుల్?

సాధారణంగా మనం ఇళ్లలో లేదా శానిటైజర్లలో వాడే ఆల్కహాల్‌లో రెండు లేదా మూడు కార్బన్ పరమాణువులు మాత్రమే ఉంటాయి. కానీ, ఐసోబ్యూటనాల్‌లో నాలుగు కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఈ నాలుగు కార్బన్ల వల్ల దీనికి ఎక్కువ శక్తి సాంద్రత (Energy Density) లభిస్తుంది. దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది నీటిని అస్సలు ఆకర్షించదు (నాన్-హైగ్రోస్కోపిక్). దీనివల్ల వాహనాల ఇంజిన్లు తుప్పు పట్టకుండా సురక్షితంగా ఉంటాయి. అంతేకాదు, పెట్రోల్ లేదా డీజిల్ వాడితే ఎలాంటి మైలేజీ, వేగం వస్తాయో.. ఐసోబ్యూటనాల్‌తోనూ సేమ్ టు సేమ్ అలాగే వస్తాయి.

Advertisement

తయారీ విధానం చాలా ఈజీ!

ఐసోబ్యూటనాల్‌ను ప్రధానంగా రెండు పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తారు.

బయో-ఐసోబ్యూటనాల్ (జీవ రసాయన ప్రక్రియ):

ఈ పద్ధతిలో జన్యుమార్పిడి చేసిన ప్రత్యేక ఈస్ట్ లేదా సూక్ష్మజీవుల సాయంతో చెరకు రసం, మొక్కజొన్న పిండి, చిరుధాన్యాల వ్యర్థాలను పులియబెట్టి (ఫెర్మెంటేషన్) తయారు చేస్తారు. మన దేశంలో ప్రస్తుతం ఉన్న ఇథనాల్ ప్లాంట్లను కొద్దిగా మోడిఫై చేస్తే చాలు.. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

రసాయన ప్రక్రియ:

పెట్రోలియం నూనెను శుద్ధి చేసే క్రమంలో వచ్చే కెమికల్ ప్రాసెస్ ద్వారా కూడా దీనిని తయారు చేస్తారు.

Advertisement

అసలైన ప్రయోజనాలు ఇవే..

ఐసోబ్యూటనాల్‌ను సాధారణ పెట్రోల్ లేదా డీజిల్‌తో చాలా సులభంగా కలపవచ్చు. ఇది ఇనుప పైపులైన్లను గానీ, ట్యాంకులను గానీ అస్సలు పాడుచేయదు. కాబట్టి దీని రవాణా కోసం కొత్తగా ఎలాంటి మౌలిక వసతులు, ప్రత్యేక పైప్‌లైన్లు నిర్మించాల్సిన అవసరం లేదు. దీని 'ఫ్లాష్ పాయింట్’ (మండే స్వభావం) ఎక్కువగా ఉండటం వల్ల నిల్వ చేయడం చాలా సురక్షితం. దీనివల్ల హానికరమైన పొగ ఉద్గారాలు తగ్గి పర్యావరణ కాలుష్యం అదుపులోకి వస్తుంది. పైగా, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీనిని తయారు చేస్తారు కాబట్టి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

Advertisement

భవిష్యత్తు దీనిదే!

ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు తమ వాహన ఇంధనాల్లో బయో ఫ్యూయల్స్‌ను తప్పనిసరిగా కలుపుతున్నాయి. ఇండోనేషియా కూడా స్థానిక పామాయిల్‌తో తయారయ్యే బయో డీజిల్ వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, గ్రీన్‌హౌస్ వాయువులను అడ్డుకుంటూ.. ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి ఐసోబ్యూటనాల్ భవిష్యత్తులో ఒక తిరుగులేని 'గ్రీన్ ఫ్యూయల్’ శక్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

English Summary

As the world shifts towards eco-friendly energy, Isobutanol is gaining attention as a potent biofuel. Capable of replacing petrol and diesel, this high-energy alcohol offers better engine efficiency and lower emissions. Explore how this carbon-dense alternative is transforming transportation infrastructure and offering a sustainable solution for the global energy crisis.