ఒకవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుంభవృష్టి.. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి భారత్ ఇస్తున్న జల హెచ్చరికలు.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ వేదికగా అటు ప్రకృతి విపత్తు, ఇటు వ్యూహాత్మక దౌత్యం ఒకేసారి చర్చనీయాంశంగా మారాయి. దోడా-కిశ్త్‌వాడ్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చింది.
దీంతో రాంబన్ జిల్లాలోని బగ్లిహార్ డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు సోమవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, మునుపెన్నడూ లేని విధంగా డ్యామ్ గేట్లను తెరవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ ప్రాంతంలో ఒక్కసారిగా మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించడంతో ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి కిశ్త్‌వాడ్‌లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు సైట్ తీవ్రంగా దెబ్బతింది. కొండల నుంచి దూసుకొచ్చిన భారీ రాళ్లు, మట్టి పెళ్లల కింద ప్రాజెక్టుకు చెందిన అనేక వాహనాలు, మిల్లులు, ఇతర యంత్రాలు పూర్తిగా కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎప్, ఎస్‌డీఆర్‌ఎఫ్, భారత ఆర్మీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. భారీ యంత్రాల సహాయంతో బురదను తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. బాధితులకు, పర్యాటకులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వరద విపత్తుల నడుమే సింధు జలాల ఒప్పందం (IWT)పై భారత్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ శాశ్వతంగా, నమ్మదగిన రీతిలో స్వస్తి పలికే వరకు 1960 నాటి ఈ ఒప్పందం 'సస్పెన్షన్' (Abeyance) లోనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చీనాబ్, బియాస్ నదులపై భారత్ నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులను పాక్ విమర్శించడాన్ని కొట్టిపారేసిన భారత్.. గతేడాది మే 15న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (CoA) ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దాన్ని తాము గుర్తించబోమని స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత ప్రభావంతో బగ్లిహార్ డ్యామ్ గేట్లన్నీ పూర్తిగా మూసివేసి ఉంచారు. దీనివల్ల నీటి నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తిలో అనేక మార్పులు వచ్చాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న అసాధారణ వర్షాల వల్ల నది ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో, ముందస్తు జాగ్రత్తగా అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తక తప్పలేదు. నిజానికి 1960 ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ వంటి తూర్పు నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇందుకోసం భాక్రా, పొంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను భారత్ నిర్మించుకుంది. అదే సమయంలో పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీరు పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. భారత్‌కు వాటిపై పరిమితమైన దేశీయ, వ్యవసాయ, రన్-ఆఫ్-ది-రివర్ (RoR) విద్యుత్ ప్రాజెక్టుల హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం పాక్ ఉగ్రవాద వైఖరి మారనంత వరకు ఈ నీటిపై భారత్ తన వ్యూహాత్మక పట్టును సడలించే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.కిశ్త్‌వాడ్‌ను ముంచెత్తిన మేఘ విస్ఫోటం
ఉగ్రవాదం వీడేవరకు పాకిస్తాన్‌కు 'జల' గండమే!
నాడు మూసివేత.. నేడు వరద ముప్పుతో గేట్లెత్తివేత