వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులకు స్వర్గధామం ఫు కువక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 32 మంది పర్యాటకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారందరూ గల్లంతయ్యారు. వారిలో 15 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి గురైన వారి వివరాలు, అత్యవసర సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్ +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, హనోయ్ కంట్రోల్ రూమ్ +84 91 308 9165 ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులా లేక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తోన్నారు.
ఈ ప్రమాదంపై దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ స్పందించింది. తమ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు చిక్కుకుపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ యాజమాన్యం తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పడవ ప్రమాదానికి గురైన వారిలో తమ సంస్థకు చెందిన ఛానల్ భాగస్వామ్యులు, ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తమను కలచివేసినట్లు తెలిపింది. ప్రమాదానికి గురైనవారి భద్రత, క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు అక్కడి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు లావా సంస్థ తెలిపింది. ఈ విపత్కర సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేసింది. ప్రస్తుతం వియత్నాం స్థానిక అధికారుల నుంచి వచ్చే తాజా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని లావా యాజమాన్యం తెలిపింది. విశ్వసనీయ సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులకు చేరవేస్తామని పేర్కొంది. భారత్, వియత్నాం దేశాల్లోని తమ కంపెనీ ప్రతినిధుల బృందాలు బాధితుల కుటుంబ సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మానసిక ధైర్యాన్ని, అవసరమైన సేవలను అందిస్తున్నాయని స్పష్టం చేసింది.