మమత బెనర్జీకి బిగ్ ఝలక్- పార్టీలో నంబర్ 2 అవుట్

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. కార్యాలయానికి తాళం వేసింది. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తిరుగుబాటు నేతలు ప్రకటించుకున్నారు.

Advertisement

ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, మాజీ మంత్రి చంద్రిమా భట్టాచార్య గుడ్ బై చెప్పారు. పార్టీలో ఉన్న తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలైన సహచరురాలిగా ఉన్న చంద్రిమా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement

కోల్‌కతా మెట్రోపాలిటన్ భవన వివాదంలో ఆమె ప్రమేయం ఉందంటూ స్వయంగా పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానించడమే చంద్రిమా భట్టాచార్య ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. ఈ మెట్రోపాలిటన్ భవన నియంత్రణ కోసం పార్టీలో మమత బెనర్జీ వర్గం, రితబ్రత వర్గానికి మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రిమా భట్టాచార్య పాత్రపై మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

తృణమూల్ అంతర్గత గ్రూపు రాజకీయాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా, కీలక సహచరురాలిగా ఉంటూ వచ్చిన చంద్రిమా.. ఇలా అర్ధాంతరంగా పార్టీ బాధ్యతల నుంచి దూరం కావడం చర్చనీయాంశమైంది. దీంతో మమత బెనర్జీ ఇక రాజకీయంగా మరింత ఒంటరి అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

ఇటీవలే ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రిమా భట్టాచార్య తన ఆవేదనను పంచుకున్నారు. పార్టీలో ఓ క్రమశిక్షణ కలిగిన సైనికురాలిగా బాధ్యతాయుతంగా వ్యవహరించానని, మారుమూల గ్రామాల్లో సైతం పార్టీ కార్యకలాపాలను తీసుకెళ్లానని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. జూన్ 3వ తేదీన తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినప్పటి నుండి, ఒకటి రెండు రోజులు మినహా ప్రతిరోజూ తాను మెట్రోపాలిటన్ కార్యాలయానికి వెళ్లి విధులు నిర్వర్తించానని స్పష్టం చేశారు.

English Summary

Major Blow to Trinamool Congress as State President Chandrima Bhattacharya Quits Party FromAll Posts. Chandrima Bhattacharya replaced Subrata Bakshi as TMC’s State President during a meeting at Kalighat on June 3, as Mamata Banerjee dissolved all existing party committees.