ఈ యాప్ లను వెంటనే డిలెట్ చేయండి- కేంద్రం తక్షణ ఆదేశాలు

దేశంలో ఇ-రిక్షాల భద్రతకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ రిక్షాలను వినియోగిస్తోన్న వారిని ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించిన ఆకతాయిల చేష్టల నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ కీలక చర్యలు తీసుకుంది. వాటి బ్యాటరీలను రిమోట్‌తో నిలిపివేయడానికి దారితీసిన మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి బీఏటీ- బీఎంఎస్, ఇ-పోచ్, లీ-యాన్, లాసిజీ అనే యాప్‌లను తక్షణమే తొలగించింది.

Advertisement

ఆయా యాప్ లన్నీ కూడా యాప్‌లు చాలా కాలంగా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటోన్నాయి. ఇ- రిక్షాలకు వినియోగించే బ్యాటరీల పనితీరును పర్యవేక్షించడానికి, బ్లూటూత్ ద్వారా లిథియం అయాన్ బ్యాటరీల వోల్టేజ్, వాటి టెంపరేచర్, ఛార్జింగ్ సైకిల్స్ వంటి సాంకేతిక వివరాలను తెలుసుకోవడానికి వాటిని రూపొందించారు. వీటిలో ఎటువంటి సెక్యూరిటీ పాస్‌వర్డులు గానీ భద్రతా ప్రమాణాలు లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమించింది.

Advertisement

బ్లూటూత్ పరిధిలో ఉన్న ఎవరైనా ఎటువంటి అనుమతి లేకుండానే ఈ యాప్‌ల ద్వారా తమకు సమీపంలో ఉన్న ఈ-రిక్షా బ్యాటరీలకు కనెక్ట్ కావచ్చు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆకతాయిలు.. ప్రయాణికులతో వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను 10 నుంచి 15 మీటర్ల దూరం నుంచే స్విచ్ఛాఫ్ చేస్తోన్నారు. దీనివల్ల నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోయి డ్రైవర్లు అయోమయానికి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

షెన్‌జెన్ గ్రెనెర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసిన బీఏటీ-బీఎంఎస్ యాప్‌ ద్వారా బ్యాటరీ వినియోగాన్ని సులభంగా కంట్రోల్ చేయవచ్చు. బ్యాటరీల మెయింటెనెన్స్ కోసం దీనిని తయారు చేసినప్పటికీ, ఎవరికీ తెలియకుండా రిక్షాలను ఆపేసే అవకాశం ఉండటంతో ఇది తీవ్రమైన ప్రజా భద్రతా ముప్పుగా మారింది. దీనివల్ల ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండటంతో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్లే స్టోర్లు లేదా యాప్ స్టోర్లలోకి అనుమతించే ముందు కఠినమైన తనిఖీలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల్లో (EV) సైబర్ రక్షణను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లూటూత్ పరిధిలో ఉన్నంత మాత్రాన ఎవరైనా యాక్సెస్ చేసుకునే వీలు లేకుండా, బలమైన అథెంటికేషన్, డేటా ఎన్‌క్రిప్షన్ విధానాన్ని తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు.

English Summary

MeitY Pulled BAT-BMS and Epoch Li-ion from Google Play and App Store Immediately Pranksters Used Them. Any other such apps being misused will also be blocked.