ఆత్మలకు ఆరు కోట్ల రూపాయల జీతాలు! పోలీసు శాఖలో ఆరేళ్ల తర్వాత బయటపడ్డ నిజం

ఖాకీ దుస్తుల రక్షణలో క్రైమ్‌ను తరిమికొట్టే పోలీసు శాఖలోనే ఒక ఊహించని భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు విధుల్లోనే లేని, పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేని 10 మంది అనామకుల పేర్లతో దాదాపు రూ.6.41 కోట్ల ప్రభుత్వ ధనాన్ని నొక్కేశారు. 2019 నుంచి 2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర స్కామ్ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు బయటపడటంతో మహారాష్ట్ర రాజకీయాలు, పోలీసు వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నకిలీ రికార్డులు సృష్టించి ప్రతి నెలా వారి ఖాతాల్లోకి ప్రభుత్వ జీతాలు జమ అయ్యేలా చేసిన ఈ బాగోతం వెనుక ఉన్న సూత్రధారులపై అధికారులు కఠిన చర్యలకు దిగారు.

Advertisement

పోలీసు శాఖలో ఉద్యోగుల జీతాల వివరాలను పాత 'సేవార్థ్' పోర్టల్ నుంచి కొత్తగా రూపొందించిన అధునాతన సాఫ్ట్‌వేర్‌లోకి మారుస్తున్న సమయంలో ఈ గోల్‌మాల్ బయటపడింది. కొత్త సిస్టమ్‌లోకి డేటాను అప్‌లోడ్ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద ఖాతాలు అధికారుల కంటికి చిక్కాయి. దీనిపై నార్త్ జోన్ కు చెందిన పోలీసు అధికారి తీవ్రంగా ఆరా తీయగా.. అసలు సర్వీసులోనే లేని 10 మందికి క్రమం తప్పకుండా నెలానెలా వేతనాలు డిపాజిట్ అయినట్లు తేలింది. ముఖ్యంగా డిసెంబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 మధ్య, అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ 2020 వ్యవధిలోనే ఈ అక్రమ నిధుల మళ్లింపు ఎక్కువగా జరిగింది.

Advertisement

పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద స్కాం..! ప్రభుత్వం కుప్పకూలబోతోందా ?

పక్కా స్కెచ్.. నకిలీ ఐడీల సృష్టి!

ఈ దందా కోసం పోలీసు శాఖలోని కొందరు క్లర్కులు, అధికారులు చేతులు కలిపినట్లు విచారణలో తేలింది. హాజరు పట్టికలు, సర్వీస్ రికార్డులను తమకు అనుకూలంగా మార్చేసి.. నకిలీ సర్వీస్ ఐడీలతో పాటు 'పెన్షన్ స్కీమ్ (DCPS)' ఐడీలను సృష్టించారు. రామ్‌దాస్ భోగ్లే, సుధాకర్ కదమ్, సర్జూ యాదవ్ వంటి 10 నకిలీ పేర్లను రికార్డుల్లో చేర్చి, ప్రజాధనాన్ని నేరుగా ప్రైవేట్ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ కేసులో అప్పట్లో పని చేసిన మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు రామ్‌కిషన్ గోస్వామి, నాగేష్ తల్వాడేకర్, విజయ్ చవాన్లతో పాటు హెడ్ క్లర్క్ అజయ్ రాథోడ్, సీనియర్ క్లర్క్ అమోల్ మేష్రమ్‌లపై కేసు నమోదు చేశారు. కాగా, విజయ్ చవాన్, అమోల్ మేష్రమ్‌లను ఇప్పటికే సస్పెండ్ చేశారు.

Advertisement
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్: దరఖాస్తులు, పోస్టులు, ఫీజు..!!

మహారాష్ట్ర రాజకీయంలో వేడి.. సీఎం వివరణ!

ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. పాలనాపరమైన లోపాలకు ఇది నిదర్శనమని శివసేన (యూబీటీ) నేతలు విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఈ అక్రమాలు 2020 నాటివని, ఇప్పటివి కావని వివరించారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, ఇప్పటికే విచారణ వేగవంతం చేశామని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.

English Summary

A massive Rs 6.4 crore payroll scam surfaces in Mumbai Police as 10 ghost employees drew monthly salaries using forged IDs. Five officials booked following a system audit.